పరిహారం ఇవ్వకుండా పనులా ?
పెనుకొండ (సోమందేపల్లి): పరిహారం ఇవ్వకుండా పనులు చేపడతారా? అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమందేపల్లి మండలంలోని తుంగోడు గ్రామ రెవెన్యూ పొలంలో తమ భూములను చదును చేస్తున్నారన్నారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా భూముల్లో సాగులో ఉన్న తమకు తెలియకుండానే పనులు చేపట్టడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పనులు ఆపాలని, సమస్య పరిష్కరించిన తర్వాతే ప్రారంభించాలని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న సోమందే పల్లి పోలీసులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తహసీల్దార్ మారుతిప్రసాద్ మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కార్యక్రమంలో రైతులు రామకృష్ణారెడ్డి, హనుమంతరెడ్డి, నారాయణరెడ్డి, శివశంకరరెడ్డి, అశ్వర్థరెడ్డి, సర్పంచ్ గంగమ్మ, నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన


