చరిత్ర ఘనం.. సౌకర్యాలు శూన్యం
లింగరూపంలో కాకుండా మానవాకృతిలో కనిపించే మహదేవుడు... మెడలో పుర్రెల మాల... అరుదైన శిల్పకళల కాణాచి... దేశంలోనే అరుదైన ఆలయం... అయినా పురావస్తు శాఖ, దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటోంది. మౌలిక వసతులు లేక భక్తులు అసౌకర్యాలకు గురవుతున్నారు.
అమరాపురం: మండలంలోని హేమావతి గ్రామంలో వెలసిన సిద్దేశ్వరస్వామి ఆలయ చరిత్ర ఘనంగా ఉంది. అయితే అక్కడ భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో నొలంబ రాజలు నిర్మించినట్లు ఇక్కడి శాసనల ద్వారా తెలుస్తోంది. 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని అప్పట్లో ఘటిక కేంద్రంగా మార్చి ఎందరికో విద్యాబుద్దులను నేర్పించారు. అరుదైన శిల్పకళతో విరాజిల్లుతున్న ఈ ఆలయాన్ని పురావస్తు శాఖతో పాటు దేవదాయ శాఖ అధికారులూ పర్యవేక్షిస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా...
సాధారణంగా శివుడు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. అయితే దేశంలో ఎక్కడ లేనివిధంగా హేమావతిలో మాత్రం శివుడు పుర్రెల మాలతో మానవాకారంలో దర్శనమివ్వడం విశేషం, ఈ ఆలయంలో నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆలయ సందర్శనకు భక్తులను అనుమతిస్తుంటారు. నిత్యం వందలాది మంది భక్తులు, పర్యాటకులు వచ్చి వెళుతుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఏటా మాఘ, ఫాల్గుణ మాసంలో వారం రోజులపాటు సిద్దేశ్వర స్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. శ్రావణమాసంలో ఎడగజాతర, కార్తీకంలో లక్ష దీపోత్సవం ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. జాతరలు, ఉత్సవాల సమయంలో కర్ణాటక, తమిళనాడు, ఉమ్మడి ఏపీ లోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.
గుక్కెడు నీటికీ కటకటే
ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న హేమావతి సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులు, పర్యాటకులు ఇక్కడ మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు వెతలు వర్ణనాతీతం. స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో బయట హోటళ్లు, దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. విడిది గదులు కూడా అంతంత మాత్రమే. ఇప్పటికై నా పురావస్తు శాఖ, దేవదాయ శాఖ అధికారులు స్పందించి సిద్దేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నొలంబ రాజుల హయాంలో
నిర్మితమైన ఆలయం
దేశంలోనే అరుదైన ఆలయంగా ఖ్యాతి
అభివృద్ధికి ఆమడ దూరం
పట్టించుకోని దేవదాయ, పురావస్తు శాఖ అధికారులు


