గంటాపురంలో చోరీ
బత్తలపల్లి: మండలంలోని గంటాపురంలో చోరీ జరిగింది. జీవాల పోషణతో జీవనం సాగిస్తున్న గ్రామానికి చెందిన పాలెం వసికేరప్ప, లక్ష్మీదేవి దంపతులు కొడుకు, కోడలు తమ బంగారాన్ని ఇంట్లోనే భద్రపరిచి బెంగళూరుకు వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి దంపతులిద్దరూ ఇంటి పక్కనే ఉన్న గొర్రెల వద్ద కాపలాగా నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి తాళాన్ని మెండి లోపలకు ప్రవేశించిన దుండగులు.. మంచానికి ఉన్న అరలో భద్ర పరిచిన నాలుగు తులాల బంగారు చైన్‌ను అపహరించారు. మంగళవారం ఉదయం విషయాన్ని గుర్తించిన దంపతుల సమాచారంతో ఎస్‌ఐ సోమశేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ముగిసిన గంధం ఉత్సవాలు
బత్తలపల్లి: మండల కేంద్రంలో వారం రోజులుగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తున్న ఖాసీం స్వామి గంధం ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. హజరత్ ఏ ఇమాం ఖాసీం ట్రస్ట్ చైర్మన్, నిర్వహకులు మక్తుం ఖాసీం వలి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో బత్తలపల్లిలో సందడి నెలకొంది. సోమవారం రాత్రి గంధోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఫక్కీర్ల విన్యాసాలు, బాణసంచా మోతలతో ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. మంగళవారం జంతు బలులతో మొక్కులు తీర్చుకుని, పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు జక్కంపూడి సత్యనారాయణ, పురుషోత్తంచౌదరి, వెంకటేశ్వరచౌదరి, తిరుపాలు, ఈడిగ కాశప్ప, కరీం సాహెబ్‌తో పాటు మక్తుం కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
నేటి నుంచి గాంధీ
సందేశ పాదయాత్ర
మడకశిర: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ సందేశ పాదయాత్ర బుధవారం ప్రారంభం కానుంది. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ పాదయాత్ర ఉదయం 9 గంటలకు మడకశిర మండలంలోని తన స్వగ్రామం నీలకంఠాపురం నుంచి ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం మడకశిరకు చేరుకుంటుంది. మడకశిరలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత మళ్లీ కొనసాగి బుళ్లసముద్రంలో రాత్రికి మకాం చేయనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. రెండో రోజు గురువారం సేవామందిర్ వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. చివరి రోజు శుక్రవారం హిందూపురంలోని గాంధీ చౌక్ వద్ద పాదయాత్ర ముగుస్తుందని వెల్లడించారు. మూడు రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు, విలువలపై యువత, విద్యార్థును చైతన్య పరచనున్నట్లు పేర్కొన్నారు.
కుణుతూరులో
ప్రాచీన శాసనాల గుర్తింపు
ధర్మవరం రూరల్: మండలంలోని కుణుతూరు గ్రామంలోని జైన మందిరం పక్కన రెండు అరుదైన ప్రాచీన శాసనాలను గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి మంగళవారం తెలిపారు. వీటి చిత్రాలను భారత పురావస్తు శాఖ వారికి పంపగా అవి క్రీ.శ. 10వ శతాబ్దం నాటి పశ్చిమ చాళుక్యుల శాసనాలుగా ప్రాథమికంగా నిర్ధారించారని వివరించారు. అలాగే గత అక్టోబర్ క్రీ.శ. 1218 సంవత్సరం నాటి యాదవ రాజుల శాసనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. గ్రామంలో ఉన్న త్రికూట చంద్రమౌళేశ్వరాలయం, జైన మందిరం రాయలసీమలోనే అత్యంత అరుదైనవిగా ఖ్యాతి గాంచాయన్నారు. దీంతో కుణుతూరును చారిత్రక వారసత్వ గ్రామంగా ప్రకటించి, వెయ్యేళ్ల ప్రాచీన చారిత్రక సంపదను సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
ధర్మవరం అర్బన్: పట్టణంలో మంగళవారం సాయంత్రం గ్యాంబ్లింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. శివానగర్ నాగులకట్ట వద్ద గ్యాంబ్లింగ్ ఆడుతున్నట్లుగా అందిన సమాచారంతో ఎస్‌ఐ ఉమాదేవి, సిబ్బంది తనిఖీలు చేపట్టి జూదరులను అరెస్ట్ చేసి, రూ.6,200 నగదు స్వాధీనం చేసుకున్నారన్నారు.
గంటాపురంలో చోరీ


