ఆరంభ శూరత్వం
పుట్టపర్తి అర్బన్: అధికారుల ఆరంభ శూరత్వం కారణంగా కొత్తచెరువు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో పలు విగ్రహాల ఏర్పాటుతో పాటు వాణిజ్య సముదాయల ఆక్రమణలతో కొత్తచెరువులోని ప్రధాన రహదారి పూర్తిగా ఇరుకుగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ ఇటీవల కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో గత ఏడాది జూలైలో రంగంలో దిగిన సంబంధిత అధికారులు.. ప్రధాన కూడలిలో ఉన్న నెహ్రూ విగ్రహం నుంచి గోరంట్ల, బుక్కపట్నం, పెనుకొండ, ధర్మవరం మార్గాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... భవన శిథిలాలను, రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలను అలాగే వదిలేయడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
మళ్లీ ఆక్రమణల పర్వం
ఆక్రమణలో ఉన్నాయనే కారణంతో పెద్దపెద్ద భవంతులను సైతం అప్పట్లో అధికారుల కూల్చి వేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు జరపకుండా మిన్నకుండిపోయారు. కొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు సైతం అడ్డుగా ఉన్నాయి. దీంతో వాటి పక్కనే ఉన్న వాణిజ్య సముదాయాల వారు తిరిగి తమతమ వ్యాపార కేంద్రాలను ముందుకు జరుపుతున్నారు. దీంతో వాహనాల పార్కింగ్‌కు సమస్య తలెత్తి మళ్లీ ప్రధాన రహదారి కాస్త ఇరుకుగా మారిపోతోంది. ట్రాఫిక్ సమస్యలు పునరావృతమయ్యాయి. రోడ్డు కింద సత్యసాయి వాటర్ పైప్ లైన్ ఉండడంతో రోడ్డు విస్తరణ కాస్త అటకెక్కించినట్లు తెలుస్తోంది. సుమారు ఏడు నెలలు గడుస్తున్నా.. సమస్యకు పరిష్కారం దక్కకపోగా మరింత జఠిలమైందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


