దశలవారీ పోరాటాలకు సిద్ధంకండి
కదిరి అర్బన్: విద్యారంగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజులు యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో ఎస్టీయూ ఉద్యమ కార్యాచరణ కరపత్రాలను వారు విడుదల చేసి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చంద్రబాబు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా దగా చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో డిమాండ్ల సాధనకు పోరాటం అనివార్యమైందని, ఆ దిశగా సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్‌లకు వినతిపత్రాలు సమర్పించడం, ఫిబ్రవరి 10న కలెక్టరేట్ వద్ద ధర్నా, 25న చలో విజయవాడ కార్యక్రమం ఉంటాయని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జవహర్, రవీంద్రనాథ్, లక్ష్మీప్రసాద్, జాఫర్‌హుస్సేన్, రామాంజనేయులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి


