బైక్ అదుపు తప్పి ఉద్యోగి మృతి
పెనుకొండ (సోమందేపల్లి): ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... తమిళనాడుకు చెందిన శ్రీధర్ రమేష్ (30) కొంతకాలంగా పాలసముద్రంలోని కియా అనుబంధ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 11 నెలల క్రితం కేరళకు చెందిన ప్రైసీసామ్రాజ్‌తో వివాహమైంది. పెనుకొండలో కాపురముంటూ రోజూ ద్విచక్ర వాహనంపై కంపెనీకి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన సోమందేపల్లి సమీపంలోని నలగొండ్రాయనిపల్లి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహోద్యోగులు అక్కడకు చేరుకుని వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వరి గడ్డి దగ్ధం
తాడిమర్రి: ఐచర్ వాహనంలో తరలిస్తున్న వరి గడ్డి ప్రమాదవశాత్తు కాలిపోయింది. స్థానికులు తెలిపిన మేరకు... నార్పల మండలం పప్పూరు గ్రామానికి చెందిన కుళ్లాయప్ప నంద్యాల నుంచి వరిగడ్డిని రైతులకు సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో పిన్నదరి, పూల ఓబయ్యపల్లి గ్రామాలకు చెందిన కొందరు రైతులకు గడ్డిని సరఫరా చేసే అంశంపై కుళ్లాయప్పతో పాల డెయిరీ నిర్వాహకుడు శివయ్య ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పదం మేరకు జమ్మలమడుగుకు చెందిన ఐచర్ వాహనం అద్దెకు తీసుకుని కుళ్లాయప్ప నంద్యాల నుంచి 1,200 గడ్డికట్టలు లోడు చేసుకుని నార్పల, ఏకపాదంపల్లి గ్రామాల మీదుగా పిన్నదరి సమీపంలోకి చేరుకున్నాడు. గ్రామంలో గంగమ్మ గుడి సమీపంలో లోడుపై ఉన్న గడ్డికి 11కేవీ విద్యుత్ తీగలు తగిలి నిప్పురవ్వులు ఎగిసి పడ్డాయి. దీంతో మంటలు చెలరేగడంతో గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాహనాన్ని బీడుభూమిలోకి డ్రైవర్ తరలించి ఆర్పడానికి ప్రయత్నం చేశారు. ఇంతలో అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా గ్రామానికి చెందిన యువకులు వాహనంలోని గడ్డిని తొలగించారు. వాహనానికి ప్రమాదం తప్పింది. ఘటనతో రూ.2.20 లక్షలు నష్టం వాటిల్లినట్లు వ్యాపారి వాపోయాడు.
ఎంఎస్ రాజు నిర్లక్ష్యానికి పరాకాష్టనే తాగునీటి ఎద్దడి
● వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్
రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు
అనంతపురం: మూడు పదవులను మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనుభవిస్తూ తన నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎంఎస్ రాజు నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుకోవడంతో నియోజకవర్గ ప్రజలు కనీసం తాగునీరు కూడా అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. మడకశిర నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైన నేపథ్యంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు ఎంఎస్ రాజుకు కనిపించడ లేదని విమర్శించారు. సినీ గ్లామర్, సీరియల్ నటుల హంగామాతో జనాన్ని పెడదోవ పట్టించడం మాని ప్రజల సమస్యల పరిష్కారం దృష్టి సారించాలని హితవు పలికారు.
బైక్ అదుపు తప్పి ఉద్యోగి మృతి


