ఏసీబీ వలలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ
హిందూపురం: ఏసీబీ వలకు ఓ వీఆర్‌ఓ, వీఆర్‌ఏ చిక్కారు. ఇంటి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేసిన హిందూపురం మండల పరిధిలోని కిరికెర–3 సచివాలయ వీఆర్‌ఓ హరిత, వీఆర్‌ఏ రామకృష్ణ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. కిరికెర సచివాలయ పరిధిలోని ఇందిరమ్మ గృహంలో నివాసం ఉంటున్న జయచంద్ర తనకు పొజిషన్ సర్టికెట్ కావాలని వీఆర్‌ఓ హరితను కోరారు. ఇందుకు గాను ఆమె రూ.5 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని జయచంద్ర ఈ విషయాన్ని ఏసీబీ అధికారులను ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం ఏసీబీ అధికారులు చెప్పినట్లుగా రూ.5 వేలు ఇస్తానని వీఆర్‌ఓకు చెప్పాడు. ఏసీబీ అధికారులు ఇచ్చిన కెమికల్ పూసిన రూ.5 వేల విలువైన ఐదు వందల నోట్లను తీసుకుని వీఆర్‌ఓ హరితకు ఫోన్ చేశాడు. అయితే ఆమె తాను వీఆర్‌ఏ రామకృష్ణను పంపుతున్నానని, అతనికి డబ్బు ఇచ్చి పంపాలని సూచించారు. అనంతరం వీఆర్‌ఏ రామకృష్ణ నేరుగా జయచంద్ర ఇంటివద్దకు వచ్చి రికార్డులకు అవసరమైన ఫొటోలు తీసుకున్నాడు. రూ.5 వేల డబ్బును జయచంద్ర నుంచి తీసుకుంటుండగా... అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అయితే వీఆర్‌ఏ లంచం గురించి తనకు తెలియదని, వీఆర్‌ఓ చెప్పినట్లు చేశానని తెలిపాడు. దీంతో ఏసీబీ అధికారులు వీఆర్‌ఏతో పాటు వీఆర్‌ఓను కూడా అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం వారిద్దరిపై కేసు నమోదు చేసి కర్నూలుకు తరలిస్తున్నట్లు ఏసీబీ కడప డీఎస్పీ సీతారామరావు తెలిపారు. దాడిలో సీఐలు హమీద్‌ఖాన్, మోహన్ ప్రసాద్, జయమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటి పొజిషన్ సర్టిఫికెట్ కోసం
లంచం డిమాండ్
బాధితుల నుంచి డబ్బులు
తీసుకుంటూ పట్టుబడిన వైనం


