నీటి కోసం నిరసనాగ్రహం
● ఖాళీ బిందెలతో రోడ్డుపై
బైఠాయించిన మహిళలు
● గంటకుపైగా రాకపోకలకు అంతరాయం
మడకశిర: గుక్కెడు నీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, తమ కన్నీటి కష్టాలు తీర్చే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... బోరు మోటర్ చెడిపోవడంతో మడకశిర పట్టణంలోని 18వ వార్డుకు 15 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో మహిళలు రోజూ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లడం, కనిపించిన ప్రతి అధికారినీ వేడుకోవడం మామూలైపోయింది. 15 రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం 18వ వార్డు మహిళలంతా ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. బేగార్లపల్లి క్రాస్‌లోని హిందూపురం ప్రధానరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంటసేపు ఆందోళన చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ లావణ్య వెంటనే అక్కడికి చేరుకుని మహిళలతో చర్చించారు. అధికారులతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు.
రోజూ ఎక్కడోచోట ఆందోళనలు
మడకశిర నియోజకవర్గంలో అప్పుడే తాగునీటి తిప్పలు మొదలయ్యాయి. చిన్నచిన్న సమస్యలు పరిష్కరించకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలంలోని కేజీగుట్ట, కొడగార్లగుట్ట గ్రామాలకు చెందిన మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. అదే విధంగా మడకశిర పట్టణంలోని వడ్రపాళ్యంలో తాగునీటి సమస్యపై మహిళలు హిందూపురం ప్రధానరోడ్డుపై నిరసన తెలిపారు. గుడిబండ మండలం ఎస్‌ఎస్ గుండ్లులో కూడా మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపారు. తాజాగా మడకశిర 18వ వార్డు మహిళలు రోడ్డుపై బైఠాయించారు.
నీటి కోసం నిరసనాగ్రహం


