జిల్లాలో తుంపర వర్షం
పుట్టపర్తి అర్బన్: వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవడంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా తుంపర వర్షం కురిసింది. పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, నల్లమాడ, కదిరి, హిందూపురం తదితర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ విడతల వారీగా వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలతో మామిడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల పూత రాలి పోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటున్నారు. మరో రెండు రోజులూ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
విశిష్ట సేవలకు సత్కారం
అనంతపురం: అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ఖ్యాతిని ఇనుమడింప చేసిన మాజీ ప్రొఫెసర్లకు ఎస్కేయూ విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేసింది. పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో స్థానం సంపాదించిన ప్రొఫెసర్ రాజూరి రామకృష్ణారెడ్డి, ప్రపంచంలోని కెమిస్ట్రీ శాస్త్రవేత్తల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న దివంగత ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభ ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ అనిత పురస్కారాలు అందజేసి సత్కరించారు.
దేశాభివృద్ధిలో
భాగస్వాములు కావాలి
అనంతపురం: హక్కులతో పాటు రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను పౌరులు గుర్తించుకోవాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు అన్నారు. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత్ విరాజిల్లడానికి రాజ్యాంగబద్ధమైన పాలనే కారణమన్నారు. దానిని పరిరక్షించుకోవాలని కోరారు.
జిల్లాలో తుంపర వర్షం


