పోలీసులు న్యాయం చేయలేదని.. సెల్ టవర్ ఎక్కాడు!
పుట్టపర్తి టౌన్: పోలీసులు న్యాయం చేయడం లేదంటూ లక్ష్మీనారాయణ అనే టీడీపీ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి, పార్టీ జెండా పట్టుకుని నిరసన తెలిపాడు. ఈ ఘటన కొత్తచెరువులో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్తచెరువు మండలం కదిరేపల్లికి చెందిన లక్ష్మీనారాయణకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె శ్రావణిని దిగువ గంగంపల్లికి చెందిన వెంకటరమణకు ఇచ్చి 2014 సంవత్సరంలో వివాహం చేశాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. తాము కట్నంగా ఇచ్చిన బంగారం, నగదు తిరిగి ఇప్పించాలంటూ రెండు నెలల క్రితం కొత్తచెరువు అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ మారుతీ శంకర్ ఇరువురినీ పిలిపించి ‘పంచాయితీ’ చేశారు. అయితే.. శ్రావణి, లక్ష్మీనారాయణ వినకపోవడంతో వారిని తమదైన శైలిలో దూషించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ శుక్రవారం ఉదయం కొత్తచెరువులోని బీఎస్‌ఎన్‌ఎల్ సెట్ టవర్ ఎక్కి టీడీపీ జెండాను పట్టుకుని కూర్చొని నిరసన తెలిపాడు. సీఐ మారుతీ శంకర్ సిబ్బందితో వచ్చి న్యాయం చేస్తామని, కిందకు దిగాలని అతనికి సూచించారు. పోలీసులపై నమ్మకం పోయిందని, తక్షణమే న్యాయం జరిగేదాకా దిగేది లేదని అతను తేల్చిచెప్పాడు. ఈ క్రమంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ఎలాగోలా సర్దిచెప్పి చివరకు కిందకు రప్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులపై తిరగ బడ్డారు. ఆడపిల్లకు న్యాయం చేయలేని మీరు ఎందుకు యూనిఫాం వేసుకున్నారు? లంచాలు తీసుకోవడానికా? అంటూ శ్రావణి నిలదీయడంతో సమాధానం చెప్పలేక సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ నాయకులను, పోలీసులను ఆశ్రయించినా తన కుమార్తెకు న్యాయం జరగలేదని, అందుకే సెల్ టవర్ ఎక్కానని లక్ష్మీనారాయణ చెప్పాడు.
పోలీసులు న్యాయం చేయలేదని.. సెల్ టవర్ ఎక్కాడు!


