
అప్పులు తీర్చడానికి యజమాని ఇంటికి కన్నం
బనశంకరి: స్నేహితుల వద్ద చేసిన అప్పు తీర్చడానికి యజమాని ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన మేనేజర్‌ను జయనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.89.09 లక్షల విలువచేసే కిలో 40 గ్రాముల నగలు, కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. జయనగర 4 వబ్లాక్ సంగం సర్కిల్‌లో అశోక్‌పరస్‌రామ్‌పూరియా అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఈయన వద్ద కార్తీక్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా మేనేజర్‌గా ఉంటున్నాడు. ఇంటిలోని బంగారుఆభరణాలు, నగదు గల్లంతు కావడంతో యజమాని తన మేనేజర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.జయనగర పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టి కార్తీక్‌ను అరెస్ట్‌చేయగా పలువురు వద్ద చేసిన అప్పులు తీర్చడానికి ఈ చోరీకి పాల్పడినట్లు నోరు విప్పాడు. నకిలీ తాళం తీసుకుని యజమాని కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో అప్పుడప్పుడు బంగారు ఆభరణాలు, నగదును చోరీకి పాల్పడి ఫైనాన్స్ సంస్థల్లో కుదువపెట్టినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆయా సంస్థలనుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో దక్షిణ విభాగ డిప్యూటీ పోలీస్‌కమిషనర్ లోకేశ్‌భరమప్ప, జయనగర ఉపవిభాగ అసిస్టెంట్ పోలీస్‌కమిషనర్ నారాయణస్వామి, జయనగర సీఐ దీపక్ తదితరులు పాల్గొన్నారు.
మేనేజర్ అరెస్ట్
రూ.89.09 లక్షల విలువైన
బంగారు, వెండి స్వాధీనం

అప్పులు తీర్చడానికి యజమాని ఇంటికి కన్నం