
అంధకారంలో 15 గ్రామాలు
● విద్యుత్ అధికారుల తీరుపై
గ్రామీణుల నిరసన
ముదిగుబ్బ: మూడు రోజులుగా 15 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. చినుకు పడితే చాలు.. కరెంటు సరఫరా నిలిచిపోతుండటంతో గ్రామీణులు కునుకు కరువై అల్లాడిపోతున్నారు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం గ్రామీణులంతా ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... మూడు రోజుల క్రితం పడిన వర్షానికి మండల పరిధిలోని మల్లేపల్లి చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మూడురోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో బోర్లు కూడా పనిచేయక తాగునీటి సమస్య ఉత్పన్నం కావడం.. రాత్రి వేళల్లో విష పురుగులు బెడద ఉండటంతో సోమవారం పలు గ్రామాల వారు మరోసారి విద్యుత్ అధికారులను సంప్రదించారు. అయినా సరైన సమాధానం చెప్పకపోవడంతో స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం నాటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోతే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
22న ఖాద్రీ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఈనెల 22వ తేదీ (శుక్రవారం) ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఈనెల 18వ తేదీలోపు దేవస్థానంలో పేర్లు నమోదు చేయించుకోవాలని ఈఓ సూచించారు. ఇందుకోసం స్వయంగా ఈఓ కార్యాలయానికి వచ్చి అప్లికేషన్ పూర్తి చేయడంతో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఇంటర్ జోనల్ స్థాయి
క్రీడా పోటీలకు జిల్లా జట్టు
హిందూపురం టౌన్: ఇంటర్ జోనల్ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించింది. కడపలో ఆదివారం జరిగిన పెన్నా జోన్ జోనల్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కడప జట్టు తలపడిన జిల్లా జట్టు పెనాల్టీ కిక్స్ రెండు గోల్స్ తేడాతో గెలుపొందింది. దీంతో ఈ నెల 16, 17వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఇంటర్ జోనల్ స్థాయి చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించింది. ఈ జట్టుకు కోచ్‌గా బీకే మహమ్మద్ సలీమ్, మేనేజర్‌గా ఇర్షాద్ అలీ వ్యవహరించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను జిల్లా ఫుట్‌బాల్ గౌరవ అధ్యక్షుడు అనిల్‌కుమార్ అభినందించారు.

అంధకారంలో 15 గ్రామాలు