
బాలిక హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవం
హిందూపురం/పుట్టపర్తి టౌన్: బాలికను కర్కశంగా చంపి శవాన్ని పూడ్చిపెట్టిన కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు న్యాయమూర్తి చిన్నబాబు సోమవారం తీర్పు చెప్పారు. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించారు. కేసు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా నామగుండ్ల గ్రామానికి చెందిన మంజులకు ఇద్దరు కుమార్తెలు. గ్రామంలో తనకు ఎవరూ లేకపోవడంతో హిందూపురం మండలం తూమకుంట గ్రామంలోని తన అక్క రత్నమ్మ వద్దకు వచ్చి ఉండేవారు. రత్నమ్మ భర్త గంగాధర్ ‘పొలం వద్దకు వెళ్దాంరా.. నీకేమైనా కొనిస్తాను’ అంటూ మంజుల ఎనిమిదేళ్ల కుమార్తె (మూడో తరగతి విద్యార్థిని)ను రోజూ పిలిచేవాడు. గంగాధర్ అంతకు మునుపే రెండు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. అతని ప్రవర్తన చూసి భయపడుతూ చిన్నారిని పంపేందుకు తల్లి మంజుల నిరాకరించేది. అయితే గత ఏడాది ఆగస్టు ఎనిమిదో తేదీన చిన్నారిని మచ్చిక చేసుకున్న గంగాధర్ పొలం వద్దకు పిలుచుకెళ్లాడు. అక్కడ క్రూరంగా చంపి.. అత్యాచారానికి ప్రయత్నించాడు. మృతదేహాన్ని సమీపంలోని పెన్నానదిలో పూడ్చిపెట్టాడు. సాయంత్రం ఒక్కడే ఇంటికి తిరిగొచ్చిన గంగాధర్‌ను తన కూతురు ఎక్కడని మంజుల అడిగింది. ఆమెతో పాటు బంధువులు కూడా నిలదీయడంతో చంపేసి నది వద్ద పూడ్చేశానని చెప్పాడు. దీంతో తల్లి హిందూపురం రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 17 మంది సాక్షులను విచారించిన అనంతరం గంగాధర్‌పై అభియోగాలు రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.