
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలు తీరుతాయన్న నమ్మకంతో పనులను మానుకుని మరీ కలెక్టరేట్ వరకూ వచ్చి అర్జీలిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై మొత్తం 226 అర్జీలు అందగా... కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆయా శాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అర్జీలు పరిష్కరించే సమయంలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఎ, రీఓపెనింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, డీపీఓ సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
అధికారులను హెచ్చరించిన
కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు
226 అర్జీలు