
రోగుల ప్రాణాలంటే లెక్కేలేదు
● వైద్య సేవల్లో నాణ్యత కరువు
● ప్రమాదకర కేసులను తేలిగ్గా
తీసుకుంటున్న డాక్టర్లు
అనంతపురం మెడికల్: పర్యవేక్షకుల బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులను నిర్లక్ష్యం ఆవహించింది. ఇటీవల ఆస్పత్రిలో జరిగిన దారుణ సంఽఘటనలు దుస్థితికి అద్దం పడుతున్నాయి. అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలసి పోతున్నా కూటమి ప్రజాప్రతినిధులు పట్టనట్లే ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతా ఇష్టారాజ్యం..
సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగంలో 5 యూనిట్లు ఉన్నాయి. అందులో ప్రొఫెసర్, 5 మంది అసోసియేట్లు, 11 మంది అసిస్టెంట్లు, ఐదుగురు సీనియర్ రెసిడెంట్లు, పదుల సంఖ్యలో పీజీ విద్యార్థులు ఉన్నారు. ఐదు యూనిట్లలో కలిపి ప్రమాదకర కేసులు కేవలం 20 నుంచి 30 వరకే ఉంటాయి. ఆయా కేసులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలి. వాస్తవంగా మెడిసిన్‌లో కొందరు వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఉంటున్నారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉంటున్నారు. వీరే ఎమర్జెన్సీ, అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ), ఐసీసీయూ, ఎంఎం, ఎఫ్‌ఎం యూనిట్లు చూసుకోవాలి. ఈ క్రమంలో రోగులకు సేవలు సరిగా అందడం లేదు. పదుల సంఖ్యలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఉన్న నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా రోజూ ప్రతి యూనిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండేలా చూడాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘మెడిసిన్’లో వైద్యుల నడుమ కోల్డ్ వార్ నడుస్తుండడంతో ఇష్టారాజ్యంగా విధులు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
పరువు పోతోంది...
కొందరు వైద్యుల పనితీరుతో మెడిసిన్ విభాగం పరువు పోతోంది. పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓపీకి ఆలస్యంగా రావడం.. మధ్యాహ్నం 12 గంటలైతే గుట్టుచప్పుడు కాకుండా పాతూరు ఐరన్ బ్రిడ్జ్, సాయినగర్ జీరో క్రాస్‌లో ఉన్న క్లినిక్‌లకు పరుగులు తీయడం చేస్తున్నారు. ఈ విషయాలపై కలెక్టర్ కాస్త దృష్టి సారిస్తే మెడిసిన్ విభాగంలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలవుతుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు మేలుకుని ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.