
ఇన్‌చార్జ్‌ల ఏలుబడి.. పట్టాలెక్కని ప్రగతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 మండలాలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర ఎంపీడీఓలదే. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు ఉంటేనే న్యాయం చేకూరుతుంది. అయితే ఇందుకు విరుద్ధంగా తొమ్మిది మండలాలకు ఇన్‌చార్జ్‌లతో కాలం నెట్టుకొస్తున్నారు. ఫలితంగా ఆయా మండలాల్లో అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్‌చార్జ్‌ల ఏలుబడిలోని మండలాలు ఇవే..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలు లేరు. అందులో అనంతపురం జిల్లా కుందుర్పి, బ్రహ్మసముద్రం, గుంతకల్లు మండలాలు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో అగళి, చిలమత్తూరు, ముదిగుబ్బ, కనగానపల్లి, రొద్దం, తనకల్లు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల బాధ్యతలను పరిపాలనాధికారులు(ఏఓ), డిప్యూటీ ఎంపీడీఓలకు అప్పగించారు. ఈ మండలాల్లో ఏళ్ల తరబడి ఇన్‌చార్జ్‌లే కొనసాగుతుండడం గమనార్హం. కొత్త వారిని నియమించినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్కడికి ఎవరూ వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆ ప్రాంత నియోజకవర్గ ప్రజాప్రతినిధులను కాదని కొత్తవారిని నియమిస్తే వారు సజావుగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
విపరీతమైన రాజకీయ జోక్యం
ఎంపీడీఓల నియామకంలో రాజకీయ జోక్యం విపరీతంగా ఉందనేది బహిరంగ రహస్యం. గతంలో పదోన్నతిపై 15 మంది ఎంపీడీఓలు జిల్లాకు వచ్చారు. వీరికి మండలాలు కేటాయించగా కర్ణాటక సరిహద్దులో ఉన్న రెండు మండలాలకు ఎంపీడీఓలు నియమితులయ్యారు. అయితే అప్పటికే అక్కడ పాతుకుపోయిన ఇన్‌చార్జ్ ఎంపీడీఓలు ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లా పరిషత్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకెళ్లి అడ్డుకున్నట్లుగా సమాచారం. కనీసం వారు జాయిన్ కూడా కానివ్వకుండా వచ్చిన వారిని వచ్చినట్లు వెనక్కి తిప్పిపంపడం విశేషం. ఈ వ్యవహారం చాలా రోజులు నడిచింది. చివరకు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి జెడ్పీ అధికారులపై చిందులు తొక్కి.. సీఈఓనే టార్గెట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
కూటమి పాలనలో కనిపించని
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి
తొమ్మిది మండలాలకు రెగ్యులర్
ఎంపీడీఓలు కరువు
నియోజకవర్గ ప్రజాప్రతినిధి సిఫారసు ఉంటేనే బాధ్యతల నిర్వర్తింపు
లేకపోతే చుక్కలు చూపిస్తున్న పాలకులు
త్వరలో నియమిస్తాం
సీనియారిటీ జాబితా ఇప్పటికే ప్రభుత్వానికి పంపాం. త్వరలో రెగ్యులర్ ఎంపీడీఓలుగా చాలా మందికి పదోన్నతి కల్పించనున్నాం. వారం, పది రోజుల్లో ఖాళీ మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలను నియమిస్తాం. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తాం.
– శివశంకర్, జెడ్పీ సీఈఓ
కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదికి పైగా అవుతోంది. అయినా పల్లె పాలన గాడిలో పడలేదు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ)ను పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో ప్రగతి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలు లేక.. ఇన్‌చార్జ్‌లతో నెట్టుకువస్తున్నారు. ఆయా మండలాల్లో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, అవకతవకలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఇన్‌చార్జ్‌ల ఏలుబడి.. పట్టాలెక్కని ప్రగతి