
యువకుడి దుర్మరణం
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గోరంట్ల: ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలు కాగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం బూదిలివాండ్లపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర (26), శ్రీనివాసులు, కార్తీక్ ఆదివారం వ్యక్తిగత పనిపై గోరంట్లకు వచ్చారు. పని ముగించుకుని ఒకే ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు రెడ్డిచెరువుకట్ట సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా ప్రధాన రహదారిపై వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్నారు. ఘటనలో మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసులు, కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురంలోని జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్ తెలిపారు.
విశ్రాంత ఉపాధ్యాయుడి
ఇంట్లో చోరీ
గోరంట్ల: స్థానిక బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు గాండ్ల వెంకటచలపతి ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు.. రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి కర్ణాటకలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెంకట చలపతి వెళ్లారు. పసిగట్టిన దొంగలు శనివారం రాత్రి తాళాలను బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. ఆదివారం ఉదయం విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంకటచలపతి కుటుంబసభ్యులు గోరంట్లకు చేరుకుని పరిశీలించారు. బీరువాలోని రూ.10 లక్షల నగదు, 16 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సర్పంచ్ ఇంట్లో...
కొత్తచెరువు: మండలంలోని బండ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గీతాబాయి ఇంట్లో చోరీ జరిగింది. అప్పాలవాండ్లపల్లి నివాసముంటున్న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బయటకు వెళ్లారు. విషయాన్ని గుర్తించిన దుండుగులు శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇంటి వద్దకు చేరుకుని తాళం ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని రూ.90 వేల నగదు అపహరించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. సర్పంచ్ భర్త రూప్లానాయక్ ఫిర్యాదు మేరకు కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
యువకుడి బలవన్మరణం
పరిగి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం మోదా గ్రామానికి చెందిన సనావుల్లా కుమారుడు సయ్యద్ ముబారక్ (18) మెకానిక్ పని నేర్చుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఆదివారం నొప్పి తీవ్రత తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

యువకుడి దుర్మరణం

యువకుడి దుర్మరణం