
నిండా ముంచిన ఖరీఫ్
అనంతపురం అగ్రికల్చర్: గత రెండు నెలలు (జూన్, జూలై) వర్షాభావం.. ఈ నెల అధిక వర్షాలు వెరసి ఖరీఫ్ కకావికలమైంది. విత్తుకునేందుకు కీలకమైన జూలైలో సాధారణం కన్నా 46 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో ఏరువాకకు అంతరాయం ఏర్పడింది. దీంతో కంది పంట మినహా మిగిలిన పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానపంటలైన వేరుశనగ, పత్తి, ఆముదం సగానికి సగం కూడా సాగులోకి రాలేదు. వ్యవసాయశాఖ తాజా నివేదిక ప్రకారం చూస్తే... ఖరీఫ్‌లో 3,42,232 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం అంచనా వేయగా... ప్రస్తుతానికి 50 శాతంతో 1.70 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఇంకా 50 శాతం విస్తీర్ణంలో విత్తు లేక పొలాలు బీళ్లుగా ఉన్నట్లు చూపించారు. ఖరీఫ్‌లో ప్రదాన పంటలు విత్తుకునేందుకు గడువు ముగిసేనాటికి అంటే ఈ నెల 5వ తేదీ నాటికి 131.1 మి.మీ గానూ 37 శాతం తక్కువగా 82.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే గత నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడు సాధారణ కన్నా 28 శాతం అధికంగా వర్షం కురవడం విశేషం.
పెరిగిన కంది విస్తీర్ణం..
ఊహించినట్లుగానే ఈ సారి కూడా కంది పంటపై రైతులు మక్కువ చూపారు. ఈ ఏడాది 55,296 హెక్టార్లు అంచనా వేయగా... ప్రస్తుతానికి 120 శాతంతో 67 వేల హెక్టార్లలో కంది వేశారు. అలాగే సజ్జ కూడా 2,054 హెక్టార్లు అంచనా వేయగా... 125 శాతంతో 2,600 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న 14,653 హెక్టార్లకు గానూ 85 శాతంతో 12,400 హెక్టార్లలో వేశారు. ఈ మూడు పంటల విస్తీర్ణం పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది. అయితే ప్రధానపంటగా భావిస్తున్న వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా 32 శాతంతో 58,300 హెక్టార్లకు పరిమితమైంది. అలాగే పత్తి కూడా 44 వేల హెక్టార్లు అంచనా వేయగా 33 శాతంతో 14,600 హెక్టార్ల వద్ద ఆగిపోయింది. మరో ప్రదాన పంట ఆముదం కూడా 16,293 హెక్టార్లకు గానూ 47 శాతంతో 7,700 హెక్టార్ల వద్ద నిలబడిపోయింది. జొన్న, రాగి, కొర్ర, ఆలసంద, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, సోయాబీన్ తదితర పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి. పంటల విస్తీర్ణంపై మరింత స్పష్టత రావాలంటే ఈ–క్రాప్ తుది నివేదికలు అందాలని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయం చూపని సర్కారు..
ప్రధాన పంటల సాగుకు గడువు ముగియడంతో ఇంకా మిగిలి ఉన్న 50 శాతం విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ దిశగా కూటమి సర్కారు ఇంకా దృష్టి సారించ లేదు. వ్యవసాయశాఖ కూడా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇంకా పంపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం లక్ష హెక్టార్లకు అయినా ఉలవ, అలసంద, పెసర, మినుము లాంటి విత్తనాలు ఉచితంగా లేదా 80 శాతం రాయితీతో ఇచ్చి ప్రత్యామ్నాయం చూపాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకూ విత్తన ప్రణాళిక తయారు చేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల నుంచి పంటల విస్తీర్ణం వివరాలు అందుబాటులోకి వచ్చినా ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపై నోరుమెదకపోవడంపై రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయం ఉంటుందా? లేదా అనేది కూడా అటు కూటమి సర్కారు ఇటు వ్యవసాయశాఖ స్పష్టత ఇవ్వడం లేదు.
కంది మినహా బాగా తగ్గిన వేరుశనగ, పత్తి, ఆముదం పంటల విస్తీర్ణం
3.42 లక్షల హెక్టార్లకు గానూ
1.70 లక్షల హెక్టార్లలో పంటలు
ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని కూటమి సర్కారు