
ఘనంగా అగ్నివీర్ మురళీనాయక్ జయంతి
పుట్టపర్తి అర్బన్: ఇటీవల ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి అశువులు బాసిన వీర జవాన్ అగ్నివీర్ మురళీనాయక్ జయంతిని ఆదివారం గోరంట్ల మండలం కల్లితండా గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మురళీనాయక్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అన్నదానం చేశారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై
చిన్నాన్న దాడి
ధర్మవరం అర్బన్: స్థానిక గుట్టకిందపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రఘునాథరెడ్డిపై అతని చిన్నాన్న పుల్లారెడ్డి పారతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదివారం రఘునాథరెడ్డి ఇంటి వద్ద ఉన్న పశువుల కొట్టంలోని నిల్వ ఉన్న వర్షపు నీరు ఆ పక్కనే ఉన్న చిన్నాన్న పశువుల కొట్టంలోకి వెళుతున్నాయి. ఈ విషయంగా రఘునాథ్‌రెడ్డి తల్లి పద్మావతితో పుల్లారెడ్డి వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రఘునాథరెడ్డి.. చిన్న విషయాలకు గొడవలు ఎందుకని తల్లి పద్మావతిని ఇంట్లోకి పిలుచుకెళుతుండగా పుల్లారెడ్డి దుర్భాషలాడుతూ పాతో రఘునాథరెడ్డిపై దాడి చేశాడు. తలకు తీవ్ర గాయమైన రఘునాథరెడ్డిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.
గోవులను అక్రమంగా
తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాప్తాడు: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి అక్రమంగా ఆవులను శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రాప్తాడు సీఐ శ్రీహర్ష తెలిపారు. ఆదివారం ఉదయం రాప్తాడు పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 407 వాహనంలో అక్రమంగా ఆవులను తరిలిస్తున్నట్లుగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, భజరంగ్ దళ్ సభ్యుడు లోకేపల్లి విశ్వనాథరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఉదయం 11 గంటలకు రాప్తాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన 407 వాహనంలో ఏడు ఆవులను గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆవులను తరలిస్తున్న షేక్ బాబ్జాన్, దేశ్‌ముఖ్ బాబ్జాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఆధీనంలోని గోవులను కూడేరులోని గోశాలకు తరలించారు.