
ఇరు గ్రామాల రైతుల పరస్పర దాడి
తాడిపత్రి టౌన్: పొలాలకు వెళ్లే రస్తా విషయంగా ఇరు గ్రామాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరస్పర దాడులకు దారి తీసింది. బాధితులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన కొందరు రైతుల పొలాలు జోగినాయునిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. ఆ పొలాలకు వెళ్లేందుకు బ్రాహ్మణపల్లి రైతులకు కేవలం కాలి నడక మాత్రమే దారి ఉంది. ట్రాక్టర్ వంటి వాహనాలను ఆ దారిలో వెళ్లకుండా జోగినాయునిపల్లి రైతులు కొండారెడ్డి, ఆదిశేఖరరెడ్డి, లక్ష్మీదేవి, పద్మావతి అభ్యంతరం చెబుతూ వచ్చేవారు. ఈ విషయంగా పలుమార్లు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి, సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. అయినా ఇరు వర్గాలు రాజీ కాలేదు. ఈ క్రమంలో కక్ష పెంచుకున్న బ్రాహ్మణపల్లికి చెందిన దాదాపు 30 మంది రైతులు శనివారం పక్కా ప్రణాళికతో రస్తా బాగు చేస్తున్నామనే నెపంతో మూడు ట్రాక్టర్లలో నాపరాళ్ల వ్యర్థాలతో చేరుకుని అక్కడే ఉన్న కొండారెడ్డి, ఆదిశేఖరరెడ్డి, లక్ష్మీదేవిపై విరుచుకుపడ్డారు. రాళ్లు, కొడవళ్లు, ఇనుపరాడ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో కొండారెడ్డి, ఆదిశేఖరరెడ్డి, లక్ష్మీదేవి తలలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు తాడిపత్రిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో కొండారెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. దాడులకు పాల్పడిన ఇరువర్గాల వారు టీడీపీకి చెందిన వారే కావడంతో ఆ పార్టీ నేతలు వారి మధ్య మరోసారి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
రస్తా విషయంగా గొడవ
ఒకరి పరిస్థితి విషమం
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇరు గ్రామాల రైతుల పరస్పర దాడి

ఇరు గ్రామాల రైతుల పరస్పర దాడి