
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
గుత్తి: స్థానిక జీఆర్‌పీ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రైలు కిందపడి ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి జీఆర్‌పీ పరిధిలోని ఓబులాపురం రైల్వే బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో జీఆర్‌పీ కానిస్టేబుల్ వాసు ఆదివారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. శనివారం అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం మూడు ముక్కలైంది. దీంతో గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య కింద తొలుత కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణలో మృతుడిని గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ (32)గా గుర్తించారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. మరో ఘటనలో పెద్ద వడుగూరుకు చెందిన సురేష్ (28) 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, సురేష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు ఘటనలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ముగిసిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు
పామిడి: రెండు రోజులుగా పామిడి వేదికగా సాగుతున్న ఏపీ విద్యాభారతి జోనల్ స్థాయి క్రీడాపోటీలు ఆదివారం ముగిశాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి 350 మంది బాలురు, 250 మంది బాలికలు హాజరయ్యారు. అండర్–13, 15 విభాగాలల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ రేస్, లాంగ్‌జంప్, హైజంప్, యోగా, చదరంగం వంటి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. కాగా, పోటీల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను ఉమ్మడి అనంతపురం జిల్లా క్రీడాకారులు దక్కించుకున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పారిశ్రామికవేత్త రాంప్రసాద్, ప్రముఖులు రాఘవయ్య, సునీల్‌కుమార్, చౌడయ్య, హెచ్‌ఎంలు శ్రీనివాసన్, మయూరి, ఆచార్య బృందం పాల్గొన్నారు.