
దిగజారి.. మసకబారి
సాక్షిప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసుల ప్రతిష్ట మసకబారింది. ఇప్పటికే శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతో పాటు మట్కా, గంజాయి, జూదం విచ్చలవిడి అయ్యాయి. టీడీపీకి, ఆ పార్టీకి చెందిన కొంతమందికి పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో జనంలో పూర్తిగా పలుచన అయ్యారు. చాలాచోట్ల పోలీసులకే ఎదురు తిరుగుతున్న దుస్థితి నెలకొంది. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు పోలీసుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారి పనితీరే వారికి శాపంగా మారింది.
లెక్కే లేదు..
జిల్లాలో పర్మిట్ రూములు, బెల్టుషాపులు ఇష్టారాజ్యంగా ఏర్పాటయ్యాయి. అన్ని హోటళ్లు, ధాబాల్లో మద్యం దొరుకుతోంది. చిన్న కాకా హోటల్‌కు వెళ్లినా మద్యం తాగుతున్న వారు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడుతున్న మద్యం రాయుళ్లు ఖాకీలపైనే తిరగబడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మద్యపానానికి అనుమతులిచ్చి మళ్లీ తమను పట్టుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు మద్యం తాగి డ్రంకన్ డ్రైవ్‌లో దొరికినా వెంటనే టీడీపీ నాయకులు ఫోన్ చేసి ‘మావాణ్ని వదిలెయ్’ అంటూ ఆదేశించగానే వదిలేస్తుండడంతో పోలీసులంటే లెక్కలేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అలా వెళ్తారంతే..
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రోజుకో కబ్జా, పూటకో ఆక్రమణ చందాన పరిస్థితి తయారైంది. స్వయానా పోలీసుస్టేషన్లలోనే కబ్జాదారులకు కుర్చీలేసి మరీ సెటిల్‌చేసి పంపిస్తున్నారు. బాధితులేమో విలపిస్తూ ఇంటికెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో కబ్జా చేశారని ఎవరైనా బాధితులు ఫోన్ చేస్తే పోలీసులు చుట్టపుచూపుగా వెళ్లాల్సిందే కానీ కబ్జాదారులను శిక్షిస్తారని కాదని అరవిందనగర్‌కు చెందిన ఓ వ్యక్తి వాపోయాడు. రెండు జిల్లాల్లో పోలీసులున్నారని ఎవరూ అనుకోవడం లేదని, ఈ విషయం జనంలో బలంగా నాటుకుపోయిందని అంటున్నారు.
హిందూపురంలో మరింత ఘోరం..
హిందూపురం నియోజకవర్గంలో పోలీసుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని కిందిస్థాయి పోలీసు సిబ్బంది అంటున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు ఏది చెబితే అదే చట్టం, న్యాయం అన్నట్టుందని వాపోతున్నారు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా వాళ్లకు ‘బాసు’ ఎవరైనా ఉన్నారంటే అది బాలకృష్ణ పీఏలే! తమకు నచ్చకపోతే అడిషనల్ ఎస్పీలనే శంకరగిరి మాన్యాలను పట్టించిన ఘనత వీరిది. కాబట్టి ఇక్కడ పోలీసులు ఉన్నా లేనట్టేనని తెలిసింది.
పోలీసుల హ్యాండ్సప్!
అస్సలు భయపడని భూ కబ్జారాయుళ్లు
మద్యం తాగి ఖాకీలకే
ఎదురు తిరుగుతున్న కొందరు..
ఒక పార్టీకి, కొందరు నేతలకు
వత్తాసు పలకడంతోనే దుస్థితి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో
పోలీసుల పరిస్థితి అత్యంత
దారుణంగా ఉందని విమర్శలు
నాకేమీ కనపడడం
లేదు సార్
అనంతపురం నగరం సిండికేట్‌నగర్‌లోని ఓ ఖాళీ స్థలంలోకి ఇటీవల కొంతమంది అక్రమంగా చొరబడ్డారు. హద్దు రాళ్లు పాతడం ప్రారంభించారు. స్థల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడికి వచ్చిన వారు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారు తప్ప కబ్జారాయుళ్లను అదుపు చేయలేకపోయారు. దీంతో బాధితుడి ఆవేదన అంతా ఇంతా కాదు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్ద 20 రోజుల క్రితం అడ్డదిడ్డంగా వెళ్తున్న ఓ కారును ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే కారు దిగిన డ్రైవర్.. పోలీసులపైనే చిందులు తొక్కాడు. దీనిపై టూటౌన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత నిందితుడిని విడుదల చేశారు.
అనంతపురంలో నిన్న డ్రంకన్ డ్రైవ్ తనిఖీలో పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. కానీ ఆ వ్యక్తి ఖాకీలనే కొట్ట బోయాడు. పోలీసులు సదరు మందు బాబును స్టేషన్‌కు తీసుకెళ్లబోతుండగా టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఫోన్ చేసి విడిపించుకెళ్లారు. పోలీసులు ఎంతలా నిస్సహాయులుగా మారిపోయారో చెప్పే ఇలాంటి ఘటనలు నిత్యం ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.