
తూకాల్లో నొక్కుడు !
సాక్షి, పుట్టపర్తి: రేషన్ పంపిణీ అవినీతికి కేరాఫ్‌గా మారింది. డీలర్ల చేతివాటంతో లబ్ధిదారులు నిలువుగా మోసపోతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నేతల దందా మూడు పువ్వలు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారుల పేరు చెబుతూ మాట దాటేస్తున్నారు. తూకాల్లో దగా చేస్తూ ప్రతి నెలా రూ.లక్షలు దండుకుంటున్నారు.
రూ.5.62 లక్షల కిలోలు బ్లాక్ మార్కెట్‌కు..
ఇవ్వాల్సిన సరుకుల కంటే ఐదు కిలోల వరకూ ప్రతి నెలా కోత విధిస్తూ రేషన్ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ, ధర్మవరంలో వెలుగు చూసిన ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మొత్తం 5.62 లక్షల కార్డులకుగానూ కార్డుకు కిలో చొప్పున మోసం చేసినా.. 5.62 లక్షల కిలోలు బ్లాక్ మార్కెట్‌కు దర్జాగా తరలించేస్తున్నారు. కిలో రూ.10 ప్రకారం అమ్మినా.. రూ.50 లక్షలు పైగా ఆర్జిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కార్డుకు ఐదు కిలోల వరకు..
చౌకధాన్యపు దుకాణంలో ఉన్న కార్డుదారుల్లో ప్రతి ఒక్క కార్డుపై ఐదు కిలోల వరకు కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కార్డుకు గరిష్టంగా (ఐదుగురు ఉంటే) 25 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ తూకం వేసినప్పుడు సరిగ్గానే ఉంటోంది. అయితే ఇంటికెళ్లాక పరిశీలిస్తే అందులో 20 కిలోలు మాత్రమే ఉంటుండటంతో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. ఒకరిద్దరు తర్వాత వచ్చి అడిగినా డీలర్లు దబాయిస్తున్నారు.
నేరుగా బ్లాక్ మార్కెట్‌కు..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్టోర్ డీలర్లందరినీ ఒక్కసారిగా మార్పు చేశారు. తమకు అనుకూలంగా ఉన్నోళ్లకు డీలర్‌షిప్ ఇవ్వడంతో అవినీతి దందాకు తెరలేపారు. కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే తూకాల్లో తేడా నిర్వాకం జరుగుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. స్టోర్ డీలర్ల నుంచి మిగిలిన సరుకును నేరుగా బ్లాక్ మార్కెట్‌కు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
మామూళ్ల మత్తులో అధికారులు
తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన తూనికలు – కొలతల అధికారులు మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఆర్నెల్లకు ఓసారి కూడా తనిఖీలు చేయడం లేదు. మరోవైపు పౌరసరఫరాల శాఖాధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడంతో డీలర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది.
బియ్యం పంపిణీలో రేషన్ డీలర్ల చేతివాటం
కార్డుకు ఐదు కిలోల వరకూ కోత
అధికారులే చెప్పారంటూ దబాయింపు
చర్యలు తప్పవు
రేషన్ షాపుల్లో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు. తూకాల్లో తేడా వచ్చినా.. వెంటనే నిలదీయండి. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే.. ఫలితం ఉండదు. తూకాల్లో మోసం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయండి. ఆకస్మిక తనిఖీలు చేసి నేరం రుజువైతే చర్యలు తీసుకుంటాం. మోసాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు.
– వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి
రొద్దం మండలం బొక్సంపల్లిలో త్రాసు మీద గోనె సంచి ఉంచి.. తూకం వేస్తున్నారు. ఫలితంగా ప్రతి కార్డుదారుడికీ సుమారు ఒకటిన్నర కిలో బియ్యం తేడా వస్తోంది. ప్రశ్నించిన వారిపై స్టోర్ డీలర్ పీఎన్ రాజు తిరగబడుతున్నాడు. ప్రభుత్వం నుంచి కమీషన్ తక్కువగా వస్తోందని, ప్రతి నెలా అధికారులకు మామూళ్లు ఇవ్వాలంటే ఈమాత్రం నొక్కాల్సిందేనని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ ఘటన గత జూన్ 1వ తేదీన వెలుగు చూసింది.
ధర్మవరం మండలం రావులచెరువు పంచాయతీ ఆర్.యర్రగుంటపల్లిలో ఒక్క కార్డుకు ఐదు కిలోల చొప్పున బియ్యం తేడా వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈనెల 1న ఓ లబ్ధిదారుడు డీలర్‌తో గొడవకు దిగారు. కావాలంటే సరుకు తీసుకెళ్లు.. లేదంటే అక్కడ పడేసి వెళ్లాలంటూ డీలర్ చెన్నారెడ్డి దబాయించాడు. దీంతో చేసేది లేక లబ్ధిదారుడు ఉన్న సరుకుతో ఇంటికెళ్లాడు. ప్రతి నెలా ఆ స్టోర్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని కార్డుదారులు వాపోతున్నారు.

తూకాల్లో నొక్కుడు !

తూకాల్లో నొక్కుడు !

తూకాల్లో నొక్కుడు !