
వర్షపు నీటి నిల్వతోనే భూగర్భజలాలు పెంపు
మడకశిరరూరల్: వర్షపు నీటి నిల్వతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు డీపీఎం లక్ష్మానాయక్ అన్నారు. మండలంలో వివిధ గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి వివిధ పంటలను పరిశీలించారు. ఉగ్రేపల్లిలో రైతు కృష్ణమూర్తి పొలంలో వర్షపు నీటి నిల్వ చేయడానికి 5 అడుగులు ఎత్తు రెండు అడుగులు వెడల్పుతో అర్ధ చంద్రాకారంలో చేపట్టిన నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పొలంలో ఈ విధానంగా నిర్మాణాలు చేసుకొంటే వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు భూమిలోకి నీరు ఇంకిపోతాయన్నారు. దీనివల్ల భూగర్భజలమట్టం స్థాయి మరింతగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కమ్యూనికేషన్ టీమ్ సభ్యురాలు కీర్తన, ఎంఎంటీఎల్ రమేష్ , సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.