
బంగారు గొలుసు అపహరణ
పుట్టపర్తి టౌన్: మాయమాటలతో దుకాణదారును ఏమార్చి ఆమె మెడలోని బంగారు గొలుసును తెలివిగా అపహరించుకెళ్లిన ఘటన పుట్టపర్తిలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు తెలిపిన మేరకు...పుట్టపర్తిలోని ఎస్‌బీఐ రోడ్డులో నివాసముంటున్న కుసుమాంబ స్థానికంగా ఓ ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు యువకులు ఫ్యాన్సీ స్టోర్‌కు వచ్చారు. ఒకరు బయట స్కూటీ మీద కూర్చొని ఉండగా, మరొకరు స్టోర్‌లోకి వెళ్లి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుగోలు చేశాడు. అదే సమయంలో కుసుమాంబతో మాటలు కలిపి వ్యాపారం ఎలా జరుగుతోందంటూ ఆరా తీశాడు. క్యాష్ బ్యాక్స్‌లో బంగారాన్ని పెడితే రెట్టింపు అవుతుందని, వ్యాపారం కూడా బాగా జరుగుతుందని నమ్మబలికాడు. అతని మాయ మాటల్లో చిక్కిన ఆమె తన మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు తీసి క్యాష్ బ్యాక్స్‌లో వేయబోతుండగా అలా కాదని తన వద్ద ఉన్న ఓ పేపర్ తీసి అందులో పెట్టమని అడిగాడు. ఆమె అలాగే పేపర్‌లో బంగారు గొలుసు పెట్టిన తర్వాత దానిని మడిచి ఆమె దృష్టి ఏమారుస్తూ క్యాష్ బ్యాక్స్‌లో వేసి, తన సహచరుడితో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఆ పేపర్ తీసి చూడగా అందులో బంగారు గొలుసు కనిపించలేదు. తాను మోసపోయినట్లుగా తెలుసుకున్న ఆమె కన్నీటిపర్యతమవుతూ స్థానికులకు వివరించింది. సమచారం అందుకున్న పుట్టపర్తి అర్బన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై బాధితురాలితో ఆరా తీశారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.