బదిలీ టీచర్లకు వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

బదిలీ టీచర్లకు వేతన వెతలు

Aug 7 2025 10:37 AM | Updated on Aug 7 2025 10:37 AM

బదిలీ

బదిలీ టీచర్లకు వేతన వెతలు

కదిరి: ఉపాధ్యాయులు రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మే, జూన్‌ మాసాల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. పదోన్నతులు పొంది బదిలీపై కొత్త పాఠశాలకు వెళ్లిన ఎంతోమంది ఉపాధ్యాయులకు ఇప్పటికీ వేతనాలు అందలేదు. పదోన్నతి పొందామని ఆనందపడాలో..జీతం రాలేదని బాధపడాలోనని అయోమయంలో ఉన్నారు. ఇంటి అద్దెలు, ఇంటి ఖర్చులతో పాటు పిల్లల ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

సమస్య ఏంటి?

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన వేసవి సెలవుల్లో మే 21న ప్రారంభమైన ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియ జూన్‌15తో ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,152 మంది టీచర్లు బదిలీ అయ్యారు. వీరిలో గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు 133 మంది, పీఎస్‌ హెచ్‌ఎంలు 193 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌లు 3,478 మంది, ఎస్‌జీ టీచర్లు 3,208 మంది, పండిట్లు 111 మంది, పీఈటీలు 29 మంది ఉన్నారు. పదోన్నతితో పాటు బదిలీ అయిన టీచర్లకు విద్యాశాఖ అధికారులు పొజిషన్‌ ఐడీలు కేటాయించాల్సి ఉంటుంది. వారు ఆ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయనందున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,200 మంది టీచర్లకు జూన్‌, జూలై మాసాలకు సంబంధించిన వేతనాలు ఖాతాల్లో జమ కాలేదు.

కూటమి సర్కారు తెచ్చిన తంటా..

కూటమి ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి పలు రకాల పాఠశాలల పేరుతో మార్పులు చేసింది. అప్‌గ్రేడ్‌ అయిన ప్రైమరీ స్కూళ్లు, కొత్తగా ఏర్పాటైన మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు బదిలీ అయిన టీచర్లు, పదోన్నతి పొందిన స్కూల్‌ అసిస్టెంట్లు, గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు... ఇలా సుమారు 2,200 మంది వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ కొత్తగా పొజిషన్‌ ఐడీలు కేటాయించాల్సి ఉంది. ఇంత వరకూ కూటమి సర్కారు ఆ పని పూర్తి చేయలేదు. సాధారణంగా వేతనాల బిల్లు ప్రతి నెలా 25వ తేదీలోపు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. ప్రభుత్వం వీరికి సకాలంలో పొజిషన్‌ ఐడీ కేటాయించనందున సంబంధిత అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేయలేక పోయారు. ఈ కారణంతో వీరికి రెండు నెలలుగా వేతన వెతలు తప్పడం లేదు.

కూటమి సర్కారు విఫలం

ఉపాధ్యాయ సమస్యలను ఇప్పటికే ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎలాంటి స్పందన లేదు. బదిలీ అయిన టీచర్లు ఎంతో మంది రెండు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ వారికి పొజిషన్‌ ఐడీ కేటాయించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది.

– పీవీ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌టీఏ

వేతన కష్టాలు తీర్చాలి

ప్రభుత్వానికి టీచర్ల నుంచి ఏదైనా సమాచారం కావాలంటే గంటల వ్యవధిలోనే ఇవ్వాలని చెబుతారు. కానీ టీచర్ల వేతనాల విషయంలో మాత్రం ప్రభుత్వం జూన్‌ నుంచి ఇప్పటి దాకా చిన్న సమస్యను పరిష్కరించలేక పోతోంది. ప్రభుత్వం వెంటనే వేతన కష్టాలు తీర్చాలి.

– కట్టుబడి గౌస్‌లాజం,

జిల్లా అధ్యక్షుడు, డీటీఎఫ్‌

ప్రభుత్వ వైఫల్యమే

వేసవి సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు పునః ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా బదిలీ అయిన కొందరు టీచర్లకు ఇంత వరకూ జీతాలు అందలేదంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. నెల జీతం రాగానే ఇంటి అద్దె, సరుకులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్‌ బిల్లు, డిష్‌ బిల్లు, సెల్‌ఫోన్‌ల రీచార్జ్‌లు, బ్యాంకు ఈఎంఐలు, పిల్లల ఫీజులు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి.

– కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌

రెండు నెలలుగా

జీతాలు అందక అవస్థలు

పొజిషన్‌ ఐడీ కేటాయించని విద్యాశాఖ అధికారులు

బదిలీ టీచర్లకు వేతన వెతలు 1
1/3

బదిలీ టీచర్లకు వేతన వెతలు

బదిలీ టీచర్లకు వేతన వెతలు 2
2/3

బదిలీ టీచర్లకు వేతన వెతలు

బదిలీ టీచర్లకు వేతన వెతలు 3
3/3

బదిలీ టీచర్లకు వేతన వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement