
విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి
గుడిబండ: విద్యుత్ షాక్‌తో రెండు మేకలతో పాటు గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన హిరేతుర్పి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. హిరేతుర్పి గ్రామానికి చెందిన తిమ్మన్న (70) జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం గ్రామ సమీపంలో పంట పొలాల్లో మేకలను మేపడానికి మహేష్ అనే రైతు మల్బరీ షెడ్ వద్దకు చేరుకున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో మేకలు కూడా మృతి చెందాయి. తిమ్మన్నకు భార్య సాకమ్మ, ఓ కుమారుడు ఉన్నారు.
నాటుసారా నిర్మూలనకు చర్యలు చేపట్టండి
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: జిల్లాలో నాటుసారా నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నవోదయం 2.0 కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నాటుసారా ప్రభావిత 7 గ్రామాలు, ప్రొహిబిషన్ ఎకై ్సజ్ పరిధిలోని 19 మండలాల్లో 53 గ్రామాలకు విముక్తి లభించడం అభినందనీయమన్నారు. ఈ సంఖ్యతో మొత్తం 53 గ్రామాల్లో నాటుసారా నిర్మూలన జరిగినట్లయిందని అన్నారు. త్వరలో జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నవోదయం 2.0 పోస్టర్లను విడుదల చేశారు. ప్రొహిబేషన్ ఎకై ్సజ్ డీసీ నాగముద్దయ్య, ఏసీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ఎకై ్సజ్ అధికారి గోవింద్‌నాయక్, ఏఎస్పీ ఆదినారాయణ, డీపీఓ సమత, డీఈఓ క్రిష్టప్ప, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చెరువులు, వంకల ఆక్రమణలపై నివేదికలు సిద్ధం చేయండి : జేసీ
జిల్లాలో చెరువులు, వంకలు, ప్రాజెక్ట్‌లు, వాగుల పరిధిలో అన్యాక్రాంతమైన భూములను గుర్తించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటర్ బాడీస్ వాచ్‌డాగ్ అంశంపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. వాగులు, వంకలు, చెరువుల స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు, పెనుకొండ, ధర్మవరం డివిజన్‌ల ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
లే అవుట్ల క్రమబద్ధీకరణకు గడువు పొడిగింపు
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పుడా) పరిధిలో వేసిన అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువు ఉందని పుడా వైస్ చైర్మన్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలకు 90006 83035లో సంప్రదించాలని సూచించారు.
కారు బోల్తా – ఇద్దరికి గాయాలు
తనకల్లు: మండలంలోని బీటీ క్రాస్ సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపు తప్పడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. తలుపులకు చెందిన రాఘవ, బాబ్జాన్ మంగళవారం అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు కారులో బయలుదేరారు. బీటీ క్రాస్ మలుపు వద్దకు చేరుకోగానే వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్‌లో క్షతగాత్రులను చికిత్స కోసం తొలుత తనకల్లు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి