
చెరువు కాలువకు అడ్డంగా మట్టి
పుట్టపర్తి అర్బన్:పుట్టపర్తి నుంచి కోడూరు వరకూ ఏర్పాటవుతున్న 342వ జాతీయ రహదారి నిర్మాణ పనులతో ఓ చెరువుకు వర్షపు నీరు చేరకుండా మట్టి కట్ట అడ్డుగా వేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామ చెరువుకు గోరంట్ల మండలం నుంచి కాలువ ద్వారా వర్షపు నీరు చేరుతుంది. ఈ చెరువు కింద సుమారు 90 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కాలువకు నీళ్లు చేరాయి. ఈ క్రమంలో కాలువపై బత్తలపల్లి వద్ద నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏడాది క్రితం పూర్తి చేశారు. ఇటీవల మరమ్మతుల కోసమని కాలువకు అడ్డంగా మట్టి కట్ట వేయడంతో నీళ్లు అక్కడే నిలిచి పక్కనున్న పొలాల్లోకి ప్రవహిస్తున్నాయి. కాలువ కట్ట ఎక్కడైనా తెగితే ఇబ్బంది పడతామని రైతులు వాపోతున్నారు. వర్షాకాలం పూర్తయితే నీళ్లు రావని దీంతో ఏడాది పంటను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేసి మట్టి కట్టను పూర్తిగా తొలగించాలని రైతులు కోరుతున్నారు.
బాల్య వివాహాన్ని
అడ్డుకున్న అధికారులు
రొద్దం: స్థానిక పంచాయతీ పరిధిలో ఓ బాల్య వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. ఇరువైపులా కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు.
వేతనాలు ఇవ్వకపోతే సమ్మెలోకి
● శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులు
ధర్మవరం: శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదని ఆ పథకం కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం కార్యాలయ ఏఓ ఖతిజున్‌కుఫ్రాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మికులు రాము, చింతకాయల నరేష్, సురేష్‌బాబు మాట్లాడారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా వెయ్యి గ్రామాలకు, 10 లక్షల మంది ప్రజలకు 540 మంది కార్మికులు తాగునీటిని అందిస్తున్నారన్నారు. నాలుగునెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. వేతనాలు ఇవ్వకపోతే ఈ నెల 11 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు.
సాయి మార్గం..
సకల జనులకు క్షేమం
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన హర్యానా, చండీఘడ్ సత్యసాయి భక్తులు మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పంచముఖి హనుమాన్ ’పేరుతో నాటిక ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సాయి మార్గం సకల జనులకు క్షేమం అంటూ సందేశాన్నిచ్చారు.

చెరువు కాలువకు అడ్డంగా మట్టి

చెరువు కాలువకు అడ్డంగా మట్టి