
మొన్న పెళ్లి.. నిన్న ఆత్మహత్య
సోమందేపల్లి : మండల కేంద్రంలోని మణికంఠ కాలనీకు చెందిన కృష్ణమూర్తి కుమార్తె హర్షిత (24) ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోని దిబ్బూరపల్లి నివాసి నాగేంద్రతో గత సోమవారం ఉదయం ఆమెకు వివాహమైంది. ఆ రాత్రికే బంధుమిత్రులంతా కలసి సోమందేపల్లికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి హర్షిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే నవ వధువు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా సమాచారం. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భార్యను చూసి వరుడు నాగేంద్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. మృతురాలి మొబైల్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని యువకుడి దుర్మరణం
తాడిపత్రి టౌన్: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ గుర్తు తెలియని యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాడిపత్రి మండలం రావి వెంకటాంపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న యువకుడి (34)ని వాహనం ఢీకొంది. ఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని తాడిపత్రి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, మృతుడు వలస కూలీ అయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ట్రాన్స్‌జెండర్ మృతి
కనగానపల్లి: మండలంలోని పర్వతదేవర సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని 50 సంవత్సరాల హిజ్రా (ట్రాన్స్‌జెండర్) మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరు నుంచి అనంతపురం వైపు వెళ్తున్న గూడ్స్ కంటైనర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి రోడ్డు పక్కన బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న ట్రాన్స్‌జెండర్‌తో పాటు డ్రైవర్ కన్నల్ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ట్రాన్స్ జెండర్ అక్కడికక్కడే మృతి చెందింది. కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మొన్న పెళ్లి.. నిన్న ఆత్మహత్య

మొన్న పెళ్లి.. నిన్న ఆత్మహత్య