పేదల బియ్యం.. ‘తమ్ముడి’ భోజ్యం | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం.. ‘తమ్ముడి’ భోజ్యం

Aug 5 2025 8:48 AM | Updated on Aug 5 2025 8:48 AM

పేదల బియ్యం..  ‘తమ్ముడి’ భోజ్యం

పేదల బియ్యం.. ‘తమ్ముడి’ భోజ్యం

పుష్ప సినిమాలో గంధపు చెక్కల స్మగ్లింగ్‌ను తలదన్నేలా రేషన్‌ అక్రమ బియ్యం దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. సోమందేపల్లికి చెందిన ఓ రేషన్‌ మాఫియా డాన్‌ ఏకంగా మూడు జిల్లాల్లో తన అక్రమ వ్యాపారాన్ని విస్తరించాడు. రాజకీయ నాయకులతో పాటు అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెబుతూ రూ.కోట్లు గడిస్తున్నాడు. అతని దందా విస్తృతి చూసి ‘రామ’ రామ..‘కృష్ణ’ కృష్ణ అంటూ అధికారులే నివ్వెరపోతున్నారు.

‘పుష్ప’ సినిమాను తలపిస్తున్న రేషన్‌ బియ్యం దందా

మూడు జిల్లాలను శాసిస్తున్న సోమందేపల్లి ‘డాన్‌’

రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్న వైనం

అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యం.. కన్నెత్తి చూడని అధికార గణం

సోమవారం ధర్మవరం మండలం సీతారాంపల్లి వద్ద రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న దృశ్యం

ధర్మవరం: మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రేషన్‌ బియ్యం మాఫియా డాన్‌గా అవతార మెత్తాడు. తొలుత పెనుకొండ నియోజకవర్గంతో మొదలు పెట్టి... ఆ తర్వాత మూడు జిల్లాలను శాసించేస్థాయికి ఎదిగాడు. ప్రతినెలా ఇతని అక్రమ సంపాదన రూ.కోటికి పైగానే ఉండటం ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది.

రేషన్‌ బియ్యం దందా ఇలా..

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో సదరు మాఫియా డాన్‌ కొత్త పుంతలు తొక్కించాడు. ఒకేసారి పెద్ద మొత్తంలో స్టాక్‌ ఉంచితే అందరికీ తెలిసిపోతుందని భావించి వినూత్నంగా ప్లాన్‌ చేశాడు. ఒక్కో జిల్లాలో 5 లేదా 6 వరకు స్టాక్‌ పాయింట్లు పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో రవాణా చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కో నియోజకవర్గంలోని మండలం, పట్టణాలను వేరుచేసి రిటైల్‌గా కొంత మందిని బియ్యం సేకరించేలా పురమాయించాడు. వారికి కిలో బియ్యంపై రూ.3 చొప్పున కమీషన్‌ ఇచ్చి సేకరిస్తాడు. వారు ఆటోలు, టాటా ఏస్‌ వాహనాల ద్వారా బియ్యాన్ని స్టాక్‌ పాయింట్‌ చేరుస్తారు. అక్కడి నుంచి రేషన్‌ మాఫియా డాన్‌ రాత్రి వేళ గంటల వ్యవధిలో సరిహద్దులు దాటిస్తాడు. పెద్ద పెద్ద ఐచర్‌ వాహనాలు, మినీ లారీలలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకు తరలిస్తున్నాడు.

వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోందిలా..

తొలుత పెనుకొండ నియోజకవర్గం నుంచి రేషన్‌ దందాను ప్రారంభించిన మాఫియా డాన్‌... ఆ తర్వాత తన రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారానికి ధర్మవరం నియోజకవర్గానికీ విస్తరించాడు. ధర్మవరానికి సమీపంలోని ఎన్‌ఎస్‌గేట్‌, సీకేపల్లి మండలం ప్యాదిండి, నామాల, మేడాపురం వద్ద స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశాడు. ధర్మవరం మండలంలో వివిధ రేషన్‌ షాపులు, ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని ఆటోల్లో స్టాక్‌ పాయింట్లకు తరలిస్తాడు. అలాగే అనంతపురం నగరం, రూరల్‌ మండలాల్లో సేకరించిన బియ్యాన్ని ఽరాప్తాడు మండలం కందుకూరు కెనాల్‌కు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన స్టాక్‌పాయింట్‌లో నిల్వ చేస్తాడు. ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని ఐచర్‌ వాహనాల్లో లోడ్‌ చేసి కర్ణాటక బంగారు పేటలోని మిల్లులకు తరలించి విక్రయిస్తాడు. సదరు మిల్లులో లావు బియ్యాన్ని సన్న బియ్యంగా ప్రాసెస్‌ చేసి అధిక ధరలకు ప్రజలకు మళ్లీ విక్రయిస్తారు.

మూడు జిల్లాల్లో జోరుగా వ్యాపారం

శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, అనంతపురం జిల్లా పరిధిలోని ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాలతో పాటు వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో కూడా బియ్యం డాన్‌ జోరుగా వ్యాపారం చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల పులివెందులలో పట్టుబడ్డ రేషన్‌ బియ్యం కూడా సదరు డాన్‌వే అయినప్పటికీ బినామీల పేర్లు చేర్పించినట్లుగా సమాచారం.

అనతికాలంలోనే భారీగా అక్రమార్జన

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రేషన్‌బియ్యం అక్రమ వ్యాపారంలో భారీగా అక్రమార్జన చేసినట్లు సమాచారం. ఆంధ్రాలో పేదల బియ్యాన్ని రిటైలర్ల దగ్గర రూ.18 చొప్పున కొని కర్ణాటకలో రూ.27 లెక్కన అమ్ముకుంటున్నారు. వందలాది వాహనాలలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ప్రతినెలా రూ.కోటికిపైగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.

రాజకీయ ఒత్తిళ్లు

నిజాయితీ గల పోలీసు ఎవరైనా రేషన్‌ బియ్యం వాహనాలను పట్టుకుంటే... వెంటనే జిల్లాలోని ఓ పార్లమెంట్‌ స్థాయి ప్రజాప్రతినిధితో పాటు బీజేపీకి చెందిన జిల్లా నాయకుడు రంగ ప్రవేశం చేస్తారు. కేసులు కట్టకూడదని ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ధర్మవరం మండలం సీతారాం పల్లి వద్ద సదరు రేషన్‌ మాఫియా డాన్‌కు చెందిన ఐచర్‌ వాహనంలో రేషన్‌ బియ్యం తరలిస్తున్న విషయం తెలుసుకుని రూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు కట్టకూడదని పోలీసులపై సదరు నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. వాహనంలోనివి రేషన్‌ బియ్యం కాదని మీడియాకు చెప్పాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీంతో సాయంత్రమైనా పోలీస్‌, రెవెన్యూ అధికారులు వివరాలు వెల్లడించక పోవడం గమనార్హం.

అధికారులకు మామూళ్లు

బియ్యం డాన్‌ రేషన్‌ బియ్యాన్ని వాహనాల్లో రాత్రి సమయంలోనే జిల్లా దాటిస్తుంటాడు. మూడు జిల్లాల రేషన్‌ బియ్యం వాహనాలు ధర్మవరం, సీకేపల్లి, సోమందేపల్లి, కియా పోలీస్‌స్టేషన్‌, కొడికొండ చెక్‌పోస్టు మీదుగా వెళ్తుంటాయి. ఈ మార్గంలోని పోలీస్‌స్టేషన్‌లకు రేషన్‌ మాఫియా డాన్‌ ప్రతి స్టేషన్‌కు ఒక్కో రేట్‌ ఫిక్స్‌ చేసి మామూళ్లు ముట్టజెబుతున్నాడు. ఒకవేళ సదరు స్టేషన్‌లలో పోలీస్‌ ఉన్నతాఽధికారులు లంచం తీసుకునేందుకు నిరాకరిస్తే కిందిస్థాయి సిబ్బందితోనే పని జరిపిస్తున్నాడు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన విజిలెన్స్‌ అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాకు రూ.1.80 లక్షల చొప్పున విజిలెన్స్‌ అఽధికారులు కొంతమందికి మామూళ్లు అందుతుండటంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement