
మాతృభాషపై మమకారం ఉండాలి
గోరంట్ల: పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఇంగ్లిష్ ప్రావీణ్యం అవసరమని, కానీ మాతృభాషపై ప్రతి ఒక్కరికీ మమకారం ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. సోమవారం ఆయన పాలసముద్రం సమీపంలోని ‘నాసిన్’ సంస్థ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రియ విద్యాలయలో తరగతులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పాఠశాలలో 2025 –2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 5 వరకు తరగతులు జరుగుతాయన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాలసముద్రం సమీపంలో కేంద్రియ విద్యాలయను ప్రారంభించిందన్నారు. విద్యార్థులు అన్ని భాషాల్లో చక్కటి ప్రావీణ్యం పెంపొందించుకునేలా అధ్యాపకులు కృషిచేయాలన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రియ విద్యాలయ ఏర్పాటుకు గతంలో జాతీయ రహదారి ప్రక్కనే స్థలం కేటాయించామని, అయితే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాసిన్ వెనక వైపు భూమిని కేటాయించి నాసిన్ ప్రాంగణంలోనే పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ‘నాసిన్’ జాయింట్ డైరెక్టర్ సత్య దివ్యరమ్య, డిప్యూటీ డైరెక్టర్ శేషు, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ కృష్ణారావు, గోరంట్ల తహసీల్దార్ మారుతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పోటీ ప్రపంచంలో రాణించాలంటే
ఇంగ్లిష్ తప్పనిసరి
కలెక్టర్ టీఎస్ చేతన్
కేంద్రియ విద్యాలయలో తరగతుల ప్రారంభం
అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్
టీఎస్ చేతన్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందే అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 269 అర్జీలు అందగా..వాటిని ఆయా శాఖలకు పంపారు. అత్యధికంగా పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ నుంచి 85 అర్జీలు అందగా, ఆ తర్వాత పెనుకొండ డివిజన్ నుంచి 79, ధర్మవరం డివిజన్ నుంచి 72, కదిరి డివిజన్ నుంచి 33 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం కలెక్టర్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. అర్జీల పరిష్కారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయి వెళ్లి విచారణ జరిపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ిఅనంతరం పలువురు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ టీఎస్ చేతన్ ‘మన మిత్ర’ యాప్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు.