
18 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 18 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఒకేరోజు 219.4 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా రొళ్ల మండలంలో 30.4 మి.మీ, బుక్కపట్నం మండలంలో 26.2 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక బత్తలపల్లి మండలంలో 24.6 మి.మీ, రొద్దం 19.4, సోమందేపల్లి 18.4, కొత్తచెరువు 15.6, గోరంట్ల 14.2, గుడిబండ 12.2, పెనుకొండ 10.6, పుట్టపర్తి 10.4, మడకశిర 8.8, అగళి 8.2, పరిగి 7.4, కనగానపల్లి 6.2, అమడగూరు 2.6, కదిరి 1.8, ధర్మవరం 1.4, నల్లమాడ మండలంలో 1.0 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాకు ‘ఎల్లో అలర్ట్’
● నాలుగు రోజులూ వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజులూ ఉమ్మడి జిల్లాకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన తెలియజేస్తూ వాతావరణవాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు విజయశంకరబాబు, జి. నారాయణ స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ఈనెల 5న మంగళవారం ‘పింక్ అలర్ట్’ కింద ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షసూచన కూడా ఉందన్నారు. 6, 7, 8 తేదీల్లో ఎల్లో అలర్ట్ కింద మోస్తరుగా వర్షసూచన ఉన్నట్లు తెలిపారు.
‘అధిక వడ్డీ’ కేసులో
మరో నిందితుడి అరెస్ట్
ధర్మవరం అర్బన్: అధిక వడ్డీల కోసం శాంతినగర్‌లో రమణ అనే వ్యక్తిపై ఇంట్లో దూరి దాడిచేసిన కేసులో ఏ–7 నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. స్థానిక టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతినగర్‌లో రమణ అనే వ్యక్తిపై దాడిచేసిన ఏడుగురిలో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. ప్రస్తుతం ఏ–7 నిందితుడు గుజ్జల విజయ్‌కుమార్‌ను రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామన్నారు. ఎవరైనా అధిక వడ్డీలు పేరుతో దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తామని సీఐ హెచ్చరించారు.
ఇద్దరు వీఆర్‌ఓలపై
సస్పెన్షన్ వేటు
రొళ్ల: పట్టపగలే మద్యం తాగి ఆ మత్తులో వీరంగం సృష్టించిన ఇద్దరు వీఆర్‌ఓలను కలెక్టర్ టీఎస్ చేతన్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏం జరిగిందంటే..
జూలై 31న సాయంత్రం రత్నగిరి వీఆర్‌ఓ నాగరాజు, గుడ్డగుర్కి వీఆర్‌ఓ రంగనాథ్ రొళ్లకొండ గ్రామ సమీపాన 544ఈ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ వద్ద పూటుగా మద్యం తాగారు. సమీపంలోని ఓ టీ బంక్ వద్దకు వచ్చి.. అక్కడే ఉన్న రత్నగిరి చెందిన మాజీ ఎంపీపీ క్రిష్ణప్ప, మరో ఐదారుగురిని అసభ్యపదజాలంతో దూషించారు. ఈ తతంగాన్ని స్థానికులు కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు దిగజారి ప్రవర్తించిన తీరుపై సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. దీంతో రొళ్ల తహసీల్దార్ షేక్షావలి వీఆర్‌ఓలను పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్ టీఎస్ చేతన్ వీఆర్‌ఓలిద్దరిపై సస్పెషన్ వేటు వేశారు. విధి నిర్వహణలో ఎవరైనా మద్యం తాగినట్లు తేలితే కఠినంగా చర్యలు తప్పవని కలెక్టర్ మరోమారు స్పష్టం చేశారు.

18 మండలాల్లో వర్షం