
టీడీపీ నేత భూదందా
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చిలమత్తూరు పంచాయతీకి చెందిన ఓ టీడీపీ నేత భూ దందాకు తెరతీశాడు. ప్రభుత్వం ఎక్కడైనా భూ సేకరణ జరుపుతున్నట్లు తెలిస్తే చాలు...అక్కడ వాలిపోతాడు. అధికారులను మచ్చిక చేసుకుని తనకు భూమి లేకపోయినా అసైన్‌మెంట్ ల్యాండ్‌కు పట్టా పొందుతాడు. ఆ తర్వాత భూమికి సంబంధించిన పరిహారం దర్జాగా తీసుకుంటాడు. ఇలా ఇప్పటికే చిలమత్తూరు పంచాయతీలోనూ తన భార్య పేరిట అసైన్‌మెంట్ పట్టా పొందాడు. ఇక లేపాక్షి నాలెడ్జి హబ్‌లోని కోడూరు పొలంలో తన భార్య పేరిటే పట్టా పొంది పరిహారం తీసుకున్నాడు. అలాగే టేకులోడు పొలంలోనూ తన భార్య పేరిటే అసైన్‌మెంట్ పట్టా పొంది పరిహారం దక్కించుకున్నాడు. తాజాగా ప్రభుత్వం టేకులోడు రెవెన్యూ గ్రామంలోనే పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ పనులు చేపట్టగా...బినామీల పేరుతో అసైన్డ్‌పట్టాలు పొందాడు. ఇప్పటికే పరిహారం కోసం వివరాలన్నీ సమర్పించాడు. నేడు, రేపో పరిహారం పొందనున్నాడు. ఈ నేపథ్యంలో సదరు టీడీపీ నేత భూ దందాపై ఇటీవలే వైఎస్సార్ సీపీ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలోనే పరిహారం పొంది కూడా మళ్లీ భార్య పేరిట మూడుచోట్ల పట్టాలు పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ నేటికీ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు.
కాంట్రాక్టర్‌గా మారి నాసిరకం పనులు
ఈ తెలుగు తమ్ముడు అధికారం అండతో భూకబ్జాలే కాకుండా కాంట్రాక్టర్ అవతారమెత్తి నాసిరకంగా పనులు చేసి ప్రజా ధనాన్ని దండుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తూ, అధికారులను భయపెడుతూ హవా కొనసాగిస్తున్నాడు. సదరు నేత చేసిన కాంట్రాక్ట్ పనులు పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
భూసేకరణ జరిగే ప్రాంతాల్లో
తన భార్య పేరిట అసైన్‌మెంట్ పట్టాలు
ఇప్పటికే రెండుచోట్ల పరిహారం కూడా పొందిన వైనం
తాజాగా టేకులోడులోనూ బినామీల పేరుతో పట్టాలు
మళ్లీ పరిహారం పొందేందుకు
ముమ్మర ప్రయత్నాలు