
అందని సాయం.. తప్పని కష్టం
కదిరి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతులను దగా చేసింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలులో వివిధ కారణాలను చూపుతూ అర్హులైన రైతుల జాబితాలో భారీగా కోత విధించింది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి 2,79,556 మంది అర్హులైన రైతులుండగా 2,65,040 మందికి మాత్రమే రూ.191.45 కోట్లు జమ చేసింది. అంటే 14,516 మంది రైతులకు రూ.10.16 కోట్ల లబ్ధికి ఎగనామం పెట్టింది.
నాడు ఎగ్గొట్టి.. నేడు మెలిక పెట్టి
కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు రూ.20 వేలు చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని ఎన్నికల సమయంలో హామీనిచ్చిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టిన తర్వాత తొలి ఏడాది ‘అన్నదాత సుఖీభవ’ పథకం పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ లెక్కన తొలి ఏడాది జిల్లా వ్యాప్తంగా 2,79,556 మంది రైతులు రూ.559.11 కోట్లు నష్టపోయారు. 2023–24 సంవత్సరంలో అప్పటి జగన్ ప్రభుత్వం జిల్లాలో రైతు భరోసా ద్వారా 2,79,556 మందికి రూ.321.47 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది.
గతంలో ఆర్థిక భరోసా
ఖరీఫ్ సీజన్‌లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ఇందులో ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా ఇచ్చే రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ7,500 కలిపి మొత్తం 13,500 ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఏటా నేరుగా రైతుల ఖాతాల్లో గత ప్రభుత్వం జమ చేస్తూ వచ్చింది. వెబ్‌ల్యాండ్ ఆధారంంగా భూమి ఉందా? లేదా? అని మాత్రమే పరిశీలించి 2,79,556 మంది రైతులకు ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.1767.09 కోట్ల లబ్ధి చేకూరింది.
మూడు విడతల్లో సకాలంలో జమ
జగన్ ప్రభుత్వం ఖరీఫ్ పంట వేసే ముందు ఏటా సరిగ్గా మే నెలలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద రూ7,500 ఇచ్చేది. తర్వాత అక్టోబర్‌లో ఖరీఫ్ పంట కోతతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండో విడతలో రూ.4 వేలు ఇచ్చింది. మళ్లీ జనవరిలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు ఇలా మూడు విడతల్లో రూ13,500 చొప్పున గత ప్రభుత్వం రైతులకు నగదు రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే వెఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, డా.వైఎస్సార్ ఉచిత పంటల భీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇలా అనేక రకాలుగా అన్నదాతను ఆర్థికంగా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
జిల్లాలో రైతు భరోసా ద్వారా 2,79,556 మంది రైతులకు లబ్ధి
కూటమి ప్రభుత్వంలో 14,516 మంది
అన్నదాతలకు అన్యాయం
మొదటి విడతలోనే రూ.10.16 కోట్లు
నష్టపోయిన జిల్లా రైతులు
వివిధ కారణాలున్నాయి
అన్నదాత సుభీభవ పథకానికి సంబంధించి వివిధ కారణాలతో సుమారు 10 వేల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ–కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి కాకపోవడం, భూముల మ్యూటేషన్ ప్రక్రియ, ఆధార్ సీడింగ్ సరిగా లేకపోవడం తదితర కారణాలతో డబ్బు జమకాలేదు. అన్నీ సరిచేసుకుంటే సమస్య ఉండదు.
– సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి
రైతులపై ఎందుకింత పగ?
వ్యవసాయమన్నా.. రైతులన్నా చంద్రబాబుకు సరిపోదు. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20వేలు ఇస్తానని చెప్పి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. ఈసారి ఖరీఫ్ వేరుశనగ సాగు సమయం దాటి పోయాక కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. ఇందులోనూ జిల్లాలో 15 వేల మంది అర్హులైన రైతులను ఆ జాబితా నుంచి తప్పించడం దారుణం. గత ఏడాది ఇవ్వాల్సిన రూ.20 వేలతో కలిపి మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిందే.
– ఉషశ్రీ చరణ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

అందని సాయం.. తప్పని కష్టం

అందని సాయం.. తప్పని కష్టం

అందని సాయం.. తప్పని కష్టం