
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: మూడు పదుల వయసు పైబడినా పెళ్లి కాలేదన్న వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని మల్లాపురం ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న పరమేశ్వరప్ప, రత్నమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం తల్లి, ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందారు. అప్పటి నుంచి ముగ్గురు అన్నదమ్ములూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దకుమారుడు వెంకటేశులకు వివాహమైంది. రెండో కుమారుడు జగదీష్ (33)కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో ఇక తనకు పెళ్లి కాదేమోనంటూ జగదీష్ తరచూ బంధువులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు వదిన చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
జిల్లాస్థాయి పోటీల్లో
విద్యార్థుల ప్రతిభ
హిందూపురం టౌన్: స్థానిక ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎన్‌ఆర్‌సీ (నోడల్ రరీసోర్స్ సెంటర్) లెవెల్‌లో జరిగిన వివిధ ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో వ్యాసరచన, వక్తృత్వ, డిబేట్, క్విజ్ పోటీలు నిర్వహించగా.. రెండు పోటీలలో ప్రథమ స్థానం, మిగిలిన రెండు పోటీలలో ద్వితీయ స్థానం సాదించినట్లు పేర్కొన్నారు. ప్రతిభ చూపిన మదీహ, సౌజన్య, తనూష, నిహారిక, సాయి శ్రీనిధి, నందినిలను అభినందించారు. 7 నుంచి కడపలో జరిగే జోనల్ లెవెల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.
రైలు పట్టాల వద్ద
వ్యక్తి మృతదేహం
హిందూపురం: స్థానిక మున్సిపల్ ఎంజీఎం మైదానం పక్కన రైలు పట్టాల వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం రైల్వే కీమెన్ గుర్తించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆకుపచ్చ, ఎర్ర గీతల ఫుల్ షర్టు, కాఫీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని చనిపోయాడా? లేదా, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పాము కాటుతో వృద్ధుడి మృతి
రాయదుర్గం టౌన్: పాము కాటుకు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కూలి పనులతో జీవనం సాగిస్తున్న ఎరికల కుమారస్వామి (66) ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని సీబీఎన్ కాలనీలో ఉన్న తన ఇంటి వద్ద కూర్చొని ఉండగా చేతికి పాము కాటు వేసింది. నాటు వైద్యంతో నయం చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి బంధువులు తరలించారు. పరిస్థితి విషమించి అదే రోజు అర్ధరాత్రి ఆయన మృతిచెందాడు. కాగా, కుమారస్వామికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య