
నేటి నుంచి ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మూడు నెలల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న
‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కరరెడ్డి, కార్యదర్శి రామాంజనేయులు యాదవ్ తెలిపారు. సోమవారం పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని చేపట్టి, ఉద్యోగుల సమస్యలపై ఆరా తీయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం సుమారు రూ.35 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కార్యక్రమాన్ని మూడు నెలల పాటు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర మహిళా కార్యవర్గంలోకి ఎంపికై న సాంబశివమ్మను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.