పుట్టపర్తి అర్బన్: ఎట్టకేలకు రైతు సేవ కేంద్రాని(ఆర్‌ఎస్‌కే)కి యూరియా చేరింది. గత నెల 30న ‘యూరియా...లేదయా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు స్పందించారు. పెడపల్లి రైతు సేవ కేంద్రానికి 260 యూరియా బస్తాలు, 60 డీఏపీ, 60 కాంప్లెక్స్ బస్తాలను అందుబాటులో ఉంచారు. యూరియా 280, కాంప్లెక్స్ 1310, డిఏపీ 1360 ధరతో విక్రయిస్తున్నారు. అయితే ఇవి స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఉంచారు. ఈ మూడు రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు తీసుకెల్లవచ్చని సహకార సంఘం అద్యక్షులు విజయ్‌కుమార్, సీఈఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు.
13న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉభయ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 13న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫైలును సిద్ధం చేసి చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మకు పంపగా.. ఆమె పరిశీలించి ఆమోదం తెలిపారు. స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు ప్రధాన హాలులో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నారు. అదనపు సమావేశ భవన్‌లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు నిర్వహించనున్నారు. సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య పర్యవేక్షణలో సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు పంపారు. జిల్లా స్థాయి అధికారులు కచ్చితంగా సమగ్ర సమాచారంతో హాజరుకావాలని పేర్కొన్నారు.
నేడు ‘పరిష్కార వేదిక’
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
పోలీస్ కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు.
ఆర్‌ఎస్‌కేకు చేరిన యూరియా
ఆర్‌ఎస్‌కేకు చేరిన యూరియా