
నమ్మించి మోసగించడం బాబుకు అలవాటే
సోమందేపల్లి: ఎన్నికల సమయంలో హామీలతో నమ్మించడం.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసగించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. ఆదివారం సోమందేపల్లి మండలంలోని చాలకూరు, కేతిగాని చెరువు గ్రామాల్లో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనంతా మోసాలతోనే కొనసాగిందని, ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు ప్రజలు నీరాజనం పలుకుతుండటాన్ని కూటమి ప్రభుత్వం ఓర్వలేక ఆటంకాలు సృష్టించాలని చూస్తోందన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన హోం మంత్రి అనిత.. రామగిరి మండలంలో అత్యాచారానికి గురైన బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. పెనుకొండలో కియా పరిశ్రమ వద్ద పారిశ్రామిక వేత్తలను మంత్రి సవిత అనుచరులు భయభ్రాంతులకు గురి చేసి, దాడులకు దిగినా హోం మంత్రి ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఏడాది అన్నదాత సుఖీభవ నగదు జమచేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం వివిధ కారణాలతో 20 వేలమంది రైతులకు లబ్ధి చేకూరకుండా చేశారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, మాజీ కన్వీనర్లు వెంకటరత్నం, నారాయణరెడ్డి, సర్పంచ్‌లు లలితమ్మ, జిలాన్‌ఖాన్, పరంధామ, కోఆప్షన్ సభ్యుడు రఫిక్, మాజీ సర్పంచ్‌లు లక్ష్మీకాంతమ్మ, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్