
మహిళ దారుణ హత్య
పరిగి: కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రొద్దం మండలం తురకలాపట్నానికి చెందిన అంజప్పకు మడకశిర మండలం చందకచెర్లు గ్రామానికి చెందిన సన్నక్క (50)తో వివాహమైంది. అయితే ఇటీవల దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో సన్నక్క భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఏమైందో తెలియదు కానీ శనివారం రాత్రి పరిగి మండలం కొడిగెనహళ్లి పంచాయతీ బిందూనగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వెనుక మైదానంలో హత్యకు గురైంది. ఎవరో ఆమె తలపై బలంగా కొట్టి చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పరిగి పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భర్త అంజప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సన్నక్క మృతికి వివాహేతర సంబంధం కారణమా.. లేక ఇంకేమైనా ఉందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
అప్పు తీర్చలేదని పొడిచి చంపేశారు
లేపాక్షి: అప్పుగా ఇచ్చిన రూ.10 వేలు తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన లేపాక్షి మండలం తిలక్‌నగర్ కాలనీ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురంలోని త్యాగరాజ్‌నగర్‌కు చెందిన దాదాపీర్ (33) అదే పట్టణానికి చెందిన మరో వ్యక్తి నుంచి రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో పలుమార్లు వారు గొడవపడ్డారు. ఆదివారం కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో దాదాపీర్‌ను తిలక్‌నగర్ వద్దకు తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి దారణంగా చంపారు. ఈ విషయంపై హతుని కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు. కాగా.. దాదాపీర్‌పై హిందూపురం పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు ఉన్నాయి.