
యువకుడి అనుమానాస్పద మృతి
నల్లమాడ: అమడగూరు మండలం మహమ్మదాబాద్ సచివాలయం సమీపంలో ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఓ యువకుడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన గుణిశెట్టి రాజేష్(36)కు ఏడేళ్ల క్రితం అమడగూరు మండలం మహమ్మదాబాద్ పంచాయతీ బావిచెరువుపల్లికి చెందిన కేశవయ్య కుమార్తె సుమిత్రతో వివాహమైంది. తాగుడుకు బానిసైన రాజేష్ తనను తరచూ వేధిస్తున్నాడంటూ కొన్నేళ్ల క్రితం భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు సుమిత్ర చేరుకుంది. ఆదివారం బావిచెరువుపల్లిలోని అత్తారింటికి వెళ్లిన రాజేష్... భార్యను కాపురానికి రావాలని కోరాడు. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అనంతరం ఏమి జరిగిందో ఏమో.. మహమ్మదాబాద్ సచివాలయం సమీపంలో చెట్టుకు వేసిన ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు పేర్కొంటుండగా... కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.