
యువకుడి బలవన్మరణం
నార్పల: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నార్పలలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా నివాసముంటున్న ఆదినారాయణ, బాలవీరమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఇటీవల కుమారుడు హర్ష (27)కు వివాహం నిశ్చయమమైంది. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా మనోవేదనకు లోనైన హర్ష.. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. ఎంత సేపటకీ హర్ష తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని గుర్తించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
బంగారు గొలుసు అపహరణ
గుంతకల్లు టౌన్: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. కాలనీలోని మసీదు పక్కన వన్నూర్‌రెడ్డి, రమాదేవి దంపతులు కిరాణా కొట్టు (రెడ్డి షాపు) ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కొట్టులో రమాదేవి కూర్చొని వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు కొట్టు దగ్గరికెళ్లి సిగరెట్లు కావాలని అడిగాడు. ఆ సమయంలో సిగరెట్ ప్యాకెట్ తీసుకునేందుకు రమాదేవి అటు తిరగగానే వెనుక నుంచి ఆమె మెడలోని 3 తులాల బరువున్న బంగారు గొలుసును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్ పై ఎక్కి ఉడాయించాడు. రమాదేవి గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ మనోహర్, టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నాన్నా అంటూ పరుగెత్తుకెళ్లి..
● వాహనం కిందపడి చిన్నారి మృతి
యాడికి: మండలంలోని లక్షుంపల్లి గ్రామంలో ఆదివారం మద్యాహ్నం వాహనం కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు.. లక్షుంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం తాను సాగుచేసిన టమాట పంటను తొలగించి వాహనంలో వేసుకుని మధ్యాహ్నం ఇంటి వద్దకు చేరుకున్నాడు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం పంటను మార్కెట్‌కు తరలించేందుకు బయలుదేరుతుండగా తన తండ్రి వెళుతున్నట్లు గుర్తించిన రెండేళ్ల వయసున్న చిన్న కుమార్తె పరుగున ఇంటి బయటకు చేరుకుంది. అప్పటికే ముందుకు కదిలిన వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందింది. విషయం తెలియగానే ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
యోగాతో
సంపూర్ణ ఆరోగ్యం
● యోగా పోటీల ప్రారంభోత్సవంలో గవిమఠం ఉత్తరాధికారి
ఉరవకొండ: సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పరిపూర్ణ జీవన విధానానికి యోగా అత్యంత ఆవశ్యమని గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ సెంట్రల్ ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్ర క్రీడలు, యువజన విభాగ శాఖ సౌజన్యంతో ఏపీ యోగాసాన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో 5వ జిల్లా స్థాయి యోగాసన చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలమూలల నుంచి 240 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. పోటీలను మఠం ఉత్తరాధికారి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించి, మాట్లాడారు. పరిపూర్ణ జీవనశైలికి యోగా ఒక బాటగా నిలుస్తుందన్నారు. అనంతరం 10 నుంచి 28 ఏళ్ల లోపు ఉన్న వారికి ఏడు ఈవెంట్‌లతో పోటీలు నిర్వహించారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్ తాటికొండ, ప్రధాన కార్యదర్శి మారుతీప్రసాద్, అబ్జర్వర్ బద్రీనాథ్, నాగభూషణ్, దివాకర్, ఆయూర్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

యువకుడి బలవన్మరణం

యువకుడి బలవన్మరణం