
‘సమగ్ర’ పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలల్లో పని చేస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లకు (పీటీఐ) ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ పీటీఐల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సైకం శివకుమారి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కృష్ణకళామందిరంలో పీటీఐల ఉమ్మడి జిల్లా అసోసియేషన్ మహాసభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు శివకుమారి మాట్లాడుతూజజ 13 ఏళ్లుగా రెగ్యులర్ టీచర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న పీటీఐలు ఇప్పటి వరకూ కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్, ప్రధానకార్యదర్శి పీఎస్ ఖాన్, మహిళా విభాగం చైర్‌పర్సన్ సురేఖరావు, పీటీఐల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, శ్రీదేవి, ప్రభాకర్, విజయకుమారి, సౌజన్య, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
‘వీఆర్వోల వీరంగం’పై అధికారుల సీరియస్
రొళ్ల: పట్టపగలే మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వీఆర్వోలపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరినీ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రొళ్లకొండ గ్రామ సమీపంలో 544ఈ జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన టోల్‌గేట్ సమీపంలో గత నెల 31న టీబంక్ వద్ద మాజీ ఎంపీపీ క్రిష్ణప్పతో పాటు మరికొందరిపై మద్యం మత్తులో రత్నగిరి వీఆర్వో నాగరాజు, గుడ్డగుర్కి వీఆర్వో రంగనాథ్ దౌర్జన్యం సాగించారు. ఈ అంశంపై ‘వీఆర్వోల వీరంగం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న వెంటనే విషయంపై స్థానిక తహసీల్దార్ షెక్షావలి, ఎస్‌ఐ వీరాంజనేయులుతో వేర్వేరుగా ఆరా తీశారు. అనంతరం ఎస్‌ఐ నేరుగా టోల్‌గేట్ వద్దకు చేరుకుని వీఆర్వోల వీరంగంపై స్థానికులతో విచారణ చేపట్టారు. అనంతరం ఇద్దరినీ ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేస్తూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వోల పనితీరుపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లు సమాచారం.
ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్

‘సమగ్ర’ పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలి