
ఆ ఉత్తర్వులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
పుట్టపర్తి టౌన్: పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్)జిల్లా కార్యదర్శి మహేంద్ర, ప్రగతిశీల విద్యార్థి సంఘం (పీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు మంజూరు నరేంద్ర ఖండించారు. విద్యార్థులు హక్కులను హరించేలా ఉన్న ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతులను ఆదివారం పుట్టపర్తిలోని గణేష్ కూడలిలో దగ్దం చేశారు. రాష్ట వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలన్నీ కూటమి ప్రభుత్వ నాయకులకు చెందినవే అన్నారు. ఆ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ, పుస్తకాలను అధిక ధరకు విక్రయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉందన్నారు. ఆమోదయోగ్యం కాని ఈ ఉత్తర్వులను ప్రజాస్వామ్యవాదులందరూ ఏకమై వ్యతిరేకించాలన్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే విద్యార్థి హక్కులపై దాడిగా భావిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు హర్షవర్దన్, సాయిప్రతాప్, శివభరత్, దినేష్, కార్తీక్, భాస్కర్, మునీంద్ర, హరి, సురే్‌ష తదితరలు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల గొంతు నులిమే కుట్ర
ధర్మవరం అర్బన్: పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆమోదయోగ్యంగా లేదని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను హరించి పాఠశాలలను జైళ్లుగా మార్చేలా ఉన్నాయన్నారు. విద్యార్థి సంఘాలను నియంత్రించడం, వాటి గొంతును అణచివేయడం లక్ష్యంగా ఇలాంటి కుట్రలకు కూటమి సర్కార్ తెరలేపిందని మండిపడ్డారు. ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మహేంద్ర