
అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అసత్యాలు ప్రచారాలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం తదితర సోషల్ మీడియా వేదికగా సత్యదూరమైన పోస్టులు పెట్టడం వల్ల అలజడులు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల అసత్యప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కదిరి మండలంలో గంజాయి మత్తులో యువకులు ఘర్షణ పడినట్లు మీడియాలో వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అలాగే పెనుకొండ వద్ద ఉన్న ‘కియా’ పరిశ్రమ వద్ద పెద్ద గొడవ జరిగినట్లు ప్రచారం జరిగిందని, ఇందులోనూ వాస్తవం లేదన్నారు. చిన్నపాటి గొడవ జరగడంతో పోలీసులు కలగజేసుకొని సర్దిచెప్పారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా సరే వ్యక్తిగత దూషణ, కించపరిచే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
వెన్నుపోటు
బాబుకు కొత్తేమీ కాదు
● ‘కియా’ ఫ్యాక్టరీపై సవిత అనుచరుల
దాడి హేయం
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
పరిగి: చంద్రబాబుకు వెన్నుపోటు కొత్తేమీకాదని, ఆయన రాజకీయ జీవితమంతా అదేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఆయన...ఇప్పుడు హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. మోసపూరిత వాగ్ధానాలకు చందబ్రాబు పేరుగాంచారన్నారు. బుధవారం ఆమె పరిగిలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చాక హామీలతో పాటు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేంత వరకూ ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు.
ఉద్యోగులపై భారం మోపడం సిగ్గుచేటు
పీ–4 కార్యక్రమం ద్వారా నిరుపేదల జీవితాలను మారుస్తామంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... నిరుపేద కుటుంబాల బాధ్యతను ఉద్యోగులు తీసుకోవాలని హుకూం జారీ చేయడమేంటని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. జీతంపై ఆధారపడి బతికే ఉద్యోగులపై ఇలాంటి భారాన్ని మోపడం సిగ్గుగా ఉందన్నారు. నిజంగా సీఎం చంద్రబాబుకు నిరుపేదల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే తన హెరిటేజ్ ఫ్యాక్టరీని అమ్మి నిరుపేదలకు ఆర్థిక చేయూత ఇవ్వాలన్నారు.
దిగజారి ప్రవర్తిస్తున్న మంత్రి సవిత..
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి సవిత సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ‘కియా’ పరిశ్రమలో ప్రతి కాంట్రాక్టు తన అనుచరులకు కట్టబెట్టేందుకు రౌడీయిజం చేసి, నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిగి మండలంలో ప్రీకాట్ మిల్లును మూయించి వేలాది కార్మిక కుటుంబాలను నడిరోడ్డున పడేశారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని మంత్రి సవిత గుర్తించాలన్నారు. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని అప్పుడు అందరికీ బుద్ధిచెప్పి తీరుతామన్నారు. ఉషశ్రీచరణ్ వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.
అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ జోన్ –6 దేశాలకు చెందిన బాలవికాస్ చిన్నారులు చేసిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. బుధవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో చిన్నారులు సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు.

అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ రత్న

అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ రత్న