
అర్చకుడి ఆత్మహత్యకు కారకులను శిక్షించాలి
కదిరి టౌన్: కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం అర్చకుడు పూజన్నస్వామి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుకవ్రారం అర్చకులు ఖాద్రీ ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖాద్రీ దేవస్థానం అర్చకులు నరసింహాచార్యులు, కుమారస్వామి, సైదాపురం ఆంజనేయస్వామి అర్చకులు పాపయ్య శాస్త్రి తదితరులు మాట్లాడారు. ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి విజయరాజు వేధింపులతోనే అర్చకుడు పూజన్నస్వామి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అర్చక సమైక్య సంఘం కదిరి అధ్యక్షుడు బాబు ప్రకాష్, కార్యదర్శి జి.శివరాం, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.