
పింఛన్ అందకుండా ‘పచ్చ’ కుట్ర
ఓడీచెరువు: రాజకీయ కక్షతో అర్హులకూ పింఛన్ అందకుండా పచ్చ నేతలు కుట్ర చేస్తున్నారు. అధికార అండతో అధికారులను భయపెట్టి ఏ ఆసరాలేని పింఛన్‌దారులను కన్నీళ్లు పెట్టిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొండకమర్ల పంచాయతీ చెరువు మునెప్పపల్లికి చెందిన సి.శ్రీనివాసరెడ్డి, సి.చిన్నపరెడ్డి, ఇ. వెంకటశివారెడ్డి సెప్టెంబరు 2023 నుంచి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరి పింఛన్లను రద్దు చేయించాలని స్థానిక టీడీపీ నాయకులు కుట్ర చేశారు. ఇందుకోసం వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే పింఛన్ రద్దవుతుందని తెలుసుకుని ఆ దిశగా ప్లాన్ వేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిని భయపెట్టి సి సి.శ్రీనివాసరెడ్డి, సి.చిన్నపరెడ్డి, ఇ. వెంకటశివారెడ్డికి రెండు నెలలుగా పింఛన్ పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితులు జూలై 28న జిల్లా కేంద్రం పుట్టపర్తిలో జరిగిన ‘పజ్రా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ చేతన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ అధికారులను మందలించారు. అర్హులందరికీ పింఛన్ ఇవ్వాలని ఆదేశించారు. అయినప్పటికీ తాజాగా ఆగస్టు (మూడో నెల) పింఛన్ వారికి పంపిణీ చేయలేదు. ఎందుకని ప్రశ్నిస్తే..‘ఇస్తాంలే’ అంటూ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. బాధితుల పింఛన్ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే వారి మూడు నెలల పింఛన్ మొత్తం అందులో కనిపిస్తోంది. ఇదే విషయంపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ పలుమార్లు ప్రయత్నించినా పంచాయతీ కార్యదర్శి అందుబాటులోకి రాలేదు. ఎంపీడీఓ మాత్రం తాను ఎవరి పింఛన్లు ఆపలేదని తెలిపారు. రాజకీయ కక్షతో తమకు పింఛన్ పంపిణీ చేయకుండా నిలిపివేయడం దుర్మార్గమని బాధితులు వాపోయారు.
అధికారం అండతో అధికారులకు
బెదిరింపులు
రాజకీయ కక్షతో రెండు నెలలుగా
పింఛన్ నిలిపివేసిన వైనం
బాధితులు కలెక్టర్‌ను కలిసినా... మూడో నెలలోనూ అదే తంతు