
ఆస్పత్రుల పనితీరు మెరుగుపడాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని ఆస్పత్రుల పనితీరు మరింత మెరుగుపడాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ చేతన్ అధ్యక్షతన జిల్లా స్థాయి నాణ్యతా ప్రమాణాల హామీ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఆస్పత్రుల పనితీరు మెరుపర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రుల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. సేవల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు చేపట్టాల్సిన పనులు, వివిధ ఆస్పత్రుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి సూచనలు చేశారు. అనంతరం కేంద్రం సర్టిఫై చేసిన ఆసుపత్రులకు అవార్డులు అందజేశారు. అలాగే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని 26 ఆస్పత్రులు, డీసీహెచ్‌ఎస్ పరిధిలోని రెండు ఆస్పత్రులకు అవార్డులిచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ టీఎస్ చేతన్ విడుదల చేశారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మధుసూదన్, పలువురు డాక్టర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
లింగ నిష్పత్తిలో అసమానతలు తొలగించాలి
లింగ నిష్పత్తిలో అసమానతలు తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలనపై జిల్లా అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనాభాలో బాలురతో పోలిస్తే బాలికల నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. ఈ అసమానతలు తొలగించి సమాజంలో ఆడపిల్లల సంఖ్యను పెంచాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యల గురించి తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కుటుంబంలో ఎవరైనా ఆడపిల్ల వద్దని వేధిస్తున్నా తమకు తెలపాలన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లింగనిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై, ఆయా కేంద్రాల్లో పనిచేసే వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు కఠినంగా శిక్షించాలన్నారు. గర్భ స్త్రావాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ ఆదినారాయణ, ఐసీడీఎస్ పీడీ ప్రమీల తదితరలు పాల్గొన్నారు.
వైద్యాధికారులకు కలెక్టర్ చేతన్ ఆదేశం