
కోతలతో ఏడి‘పింఛన్’
నల్లమాడ: అధికారుల తప్పిదం పింఛన్‌దారులకు శాపంగా మారింది. పింఛన్ల పునఃపరిశీలన పేరుతో జారీ చేసిన నోటీసును ఇష్టానుసారం తయారు చేశారు. పింఛన్‌దారుడు ఓ జబ్బుతో బాధపడుతుంటే మరో జబ్బు నమోదు చేసి నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు తీసుకుని పింఛన్‌దారుడు ఆస్పత్రికి వెళ్లగా... సంబంధిత వైద్యుడు అందుబాటులో లేక పునఃపరిశీలన చేయించుకోలేకపోయారు. ఇదే అదనుగా ప్రభుత్వం వారికి పింఛన్ నిలిపివేసింది.
పింఛన్ రద్దుచేసే కుట్ర..
వివిధ కారణాలను సాకుగా చూపి ఇప్పటికే వేలాది మందిని పింఛన్‌కు అనర్హులుగా చూపిన కూటమి సర్కార్..తాజాగా పునఃపరిశీలన పేరుతో మరికొందరి పింఛన్‌ను నిలిపివేసింది. వాస్తవానికి పింఛన్ రద్దుచేసే కుట్రతోనే కూటమి సర్కార్ దివ్యాంగులు, వివిధ జబ్బులతో బాధపడుతున్న వారి పింఛన్‌ల పునఃపరిశీలన చేపట్టింది. ఇందుకోసం లబ్ధిదారులకు నోటీసు జారీ చేసి నోటీసులో పేర్కొన్న రోజున ఆస్పత్రికి వెళ్లి పునఃపరిశీలన పూర్తి చేయాలని పేర్కొంది. అయితే అధికారులు కంటి సమస్యతో బాధపడుతున్న వారిని చెవిటి వారుగా, కాళ్లు విరిగిన వారిని అంధత్వంతో బాధపడుతున్న వారిగా పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో పింఛన్ లబ్ధిదారులు ఆ నోటీసు తీసుకుని ఆస్పత్రికి వెళ్తే తమ జబ్బును నిర్ధారించే వైద్యుడు అందుబాటులో లేరు. ఇలా అంధత్వంతో బాధపడుతున్న ఓ లబ్ధిదారుడు ఆస్పత్రి వెళ్లగా ఇక్కడ ఆర్థో వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో ఆస్పత్రి వారు అతన్ని వెనక్కి పంపారు. మరోసారి నోటీసు పంపుతారని అతను వేచి చూసినా ఫలితం లేకపోయింది. తాజాగా ఇలాంటి వారందరి పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది. కారణమడిగితే పునఃపరిశీలనకు హాజరుకాలేదని పేర్కొంది. దీంతో పింఛన్ లబ్ధిదారులంతా లబోదిబోమంటున్నారు. ఇలాంటి వారు నల్లమాడ మండలంలోనే 20 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా వేలల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పింఛన్ అందని వారి జాబితాను ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మండల స్థాయి అధికారులు చెబుతున్నారు.
ఇష్టారాజ్యంగా పింఛన్
పునఃపరిశీలన నోటీసులు
ఓ జబ్బుతో బాధపడుతుంటే
మరో జబ్బుతో నోటీసు
తీరా ఆస్పత్రికి వెళ్లాక
అందుబాటులో లేని వైద్యుడు
లబ్ధిదారులపైనే నెపం మోపుతూ
పింఛన్ నిలిపివేత