
అంతర్రాష్ట దొంగ అరెస్ట్
హిందూపురం టౌన్: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక జీఆర్పీ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ధర్మవరం జీఆర్పీ సీఐ అశోక్ కుమార్, ఎస్‌ఐ సజ్జప్ప, ధర్మవరం ఆర్పీఎఫ్ ఎస్‌ఐ రోహిత్ గౌడ్, హిందూపురం ఎస్‌ఐ సాయినాథరెడ్డి వెల్లడించారు. రైళ్లలో చోటు చేసుకున్న చైన్‌స్నాచింగ్‌లకు సంబంధించి కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం హిందూపురంలోని రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం 2లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒడిశాలోని బారకం గ్రామానికి చెందిన బినోత్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చైన్‌స్నాచింగ్‌ల అంశం వెలుగు చూసింది. ధర్మరం సర్కిల్ పరిధిలోని హిందూపురం ఆర్‌పీఎస్‌లో మూడు కేసులు, ధర్మవరం ఆర్‌పీఎస్‌లో రెండు కేసులు, కదిరి ఆర్‌పీఎస్‌లో ఒక కేసులో నిందితుడిగా గుర్తించి 75 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
‘ఆ టీచర్ మా కొద్దు’
ముదిగుబ్బ: మండలంలోని బ్రహ్మదేవరమర్రి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు వి. రోజారాణి తమకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి కేటాయించిన ఉపాధ్యాయురాలు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. సమయపాలన పాటించడం లేదన్నారు. పాఠశాలలోనే నిద్ర పోతుంటారన్నారు. గ్రామస్తులు ప్రశ్నిస్తే మా ఆయన పోలీస్, మీపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతోందని వాపోయారు. ఇలాంటి ఉపాధ్యాయులతో తమ పిల్లల విద్యాభివృద్ధి కుంటుపడుతుందని, ఆమెను బదిలీ చేసి, మరో ఉపాధ్యాయుడిని నియమించాలంటూ కోరారు. దీనిపై స్పందించిన ఎంఈఓ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.
తేలు కుట్టి యువకుడి మృతి
గుంతకల్లు రూరల్: మండలంలోని దంచర్ల గ్రామానికి చెందిన కొట్టం రామాంజనేయులు కుమారుడు శివ (30) తేలు కుట్టడంతో మృతిచెందాడు. వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా ఉన్న శివకు 18 నెలల క్రితం వివాహమైంది. శుక్రవారం పొలం పనులు చేస్తున్న సమయంలో తేలు కుట్టింది. గుర్తించిన బాధితుడు వెంటనే తేలును చంపేశాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు తెలపడంతో వారు గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స అందేలోపు శివ మృతి చెందాడు.

అంతర్రాష్ట దొంగ అరెస్ట్