
దారితెన్నూ లేని పనులు
పుట్టపర్తి అర్బన్: జాతీయ రహదారి–342 పనులు దారీతెన్నూ లేకుండా సా...గుతున్నాయి. ప్రజాప్రతినిధులు పట్టించుకోక... అధికారుల నిర్లక్ష్యం వెరసి రహదారి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే బెంగళూరు నుంచి జిల్లా కేంద్రం పుట్టపర్తికి రెండుగంటల్లో చేరుకోవచ్చు. సత్యసాయి జయంత్యుత్సవాల నేపథ్యంలో ఈ మార్గం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. బాబా శత జయంత్యుత్సవాలకు విదేశాల నుంచి వచ్చే భక్తులు విమానంలో బెంగళూరు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రశాంతి నిలయం చేరుకుంటారు. కానీ ఈ రహదారి బాబా జయంత్యుత్సవాలకు అందుబాటులో వచ్చేలా కనిపించడం లేదు.
వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభం..
పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ పెంచి తద్వారా పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలో ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం, పుట్టపర్తి, గోరంట్ల మీదుగా చిలమత్తూరు మండలం కోడూరు వరకూ నూతనంగా నాలుగు వరుసల రహదారికి (ఎన్‌హెచ్–342) రూపకల్పన చేసి పనులు కూడా ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పనులు శరవేగంగా జరిగాయి. చిత్రావతిపై బ్రిడ్జి, గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్ వద్ద ప్‌లైవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో పాటు కర్ణాటకనాగేపల్లి వద్ద , వెంగళమ్మచెరువు ప్రధాన రహదారిపై బ్రిడ్జిల నిర్మాణం ఊపందుకుంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పనులు నెమ్మదించాయి.
రూ.1,745 కోట్లతో రోడ్డు నిర్మాణం..
ముదిగుబ్బ నుంచి ప్రారంభమయ్యే జాతీయ రహదారి–342 చిలమత్తూరు మండలం కోడూరు వరకు మొత్తం రోడ్డు 80 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇందుకోసం రూ.1,745 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముదిగుబ్బ – బుక్కపట్నం మధ్య 85 శాతం పనులు పూర్తికాగా, ఆ రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నాయి. రెండో విడత పనుల్లో భాగంగా జగరాజుపల్లి నుంచి కోడూరు వరకూ పనులు కొనసాగుతున్నాయి. 7 గ్రామాల్లో బైపాస్‌లతో పాటు బడేనాయక్ తండా వద్ద ఉన్న నల్లగుట్ట, పుట్టపర్తి వద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అలాగే గువ్వలగుట్టపల్లి వద్ద రైతుల భూములకు పరిహారం సకాలంలో అందక పోవడంతో అక్కడ పనులకు బ్రేక్ పడింది.
బెంగళూరు నుంచి
భారీగా భక్తులు వచ్చే అవకాశం
సత్యసాయి శత జయంత్యుత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు. అలాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు విచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో నుంచి ఏ రాష్ట్రం నుంచి రావాలన్నా... విదేశాల నుంచి రావాలన్నా అందరూ బెంగళూరు విమానాశ్రయం వచ్చి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రశాంతి నిలయం చేరుకుంటారు. అంతేకాకుండా బెంగళూరులో సత్యసాయి బాబా ఆశ్రమం కూడా ఉంది. అందువల్ల ఈ మార్గమే అందరికీ అనుకూలంగా ఉంది. అలాగే తమిళనాడు నుంచి వచ్చే భక్తులు కూడా బెంగళూరు మీదుగానే ప్రశాంతి నిలయం వస్తారు. దీంతో బాబా శతజయంత్యుత్సవాల సమయంలో ఈ మార్గంపై రద్దీ పెరుగుతుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న రోడ్డు పూర్తి కాకపోతే డైవర్షన్లు, మట్టి రోడ్డు, అసంపూర్తి పనులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పుట్టపర్తి చుట్టూ నిర్మాణ పనులు సగం కూడా పూర్తి కాక పోవడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. బాబా శత జయంత్యుత్సవాల కోసం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపట్టే పనులు శరవేగంగా సాగుతున్నా... ప్రధానమైన రహదారి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దీంతో భక్తులంతా కూటమి సర్కార్‌ను తప్పుపడుతున్నారు. కనీసం ఇప్పటికై నా స్పందించి బాబా శత జయంత్యుత్సవాల నాటికి వీలైనంత వరకూ రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
సా...గుతున్న
ఎన్‌హెచ్–342 పనులు
వందరోజుల్లో సత్యసాయి
శత జయంతి
బెంగళూరు మార్గం నుంచే
లక్షలాది మంది రాక
అప్పటికై నా రోడ్డు నిర్మాణం
పూర్తి చేయాలంటున్న స్థానికులు

దారితెన్నూ లేని పనులు